Hadi Murder Accused In Dubai: దుబాయ్ లో ఉస్మాన్ హాడీ హత్య నిందితుడు.. !
బంగ్లాదేశ్ గూఢచార సంస్థలు మరోసారి బొక్క బోర్లా పడ్డాయి. విద్యార్థినేత ఉస్మాన్ హాడీ హత్యకేసు నిందితులు భారత్ పారిపోయారని.. వారు బీఎస్ఎఫ్, కోల్ కతా పోలీసుల అదుపులో ఉన్నారని బంగ్లాదేశ్ ప్రభుత్వం, అక్కడి పత్రికలు ఊదరగొట్టాయి. ఇంకా చెప్పాలంటే ఆ నిందితులకు భారత్ అండగా ఉందని భ్రమ కలిగించేందుకుప్రయత్నించాయి. అయితే దానికి ఆ కేసులో నిందితుడే తెరదించారు. తాను దుబాయ్ లో ఉన్నానంటూ వీడియో సైతం విడుదల చేశాడు. తనకు హత్యతో ఎలాంటి సంబంధం లేదంటూ వీడియోలో స్పష్టం చేశాడు.
వీడియోలో ఫైసల్ మాట్లాడుతూ.. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. దీని నుంచి తనని తాను రక్షించుకునేందుకు దుబాయ్‌కు వెళ్లిపోయినట్లు తెలిపాడు. జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించాడు. ఈ సందర్భంగా హాడీతో తనకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపాడు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడం కోసం హాదీ రాజకీయ కార్యకలాపాలకు తాను విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
ఫైసల్ వీడియోతో బంగ్లాదేశ్ ప్రజల్లో చాలా వరకూ క్లారిటీ వచ్చింది. హాడీని హత్య చేసిన వ్యక్తులు.. ఎలా దుబాయ్ పారిపోయారు. వారికి ఎవరు సహకరించారు..? వీటన్నింటిపైనా ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు.. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితులను వేగంగా అరెస్ట్ చేసి, వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం యూనస్ సర్కార్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇప్పుడు దుబాయ్ లో ఉన్న నిందితుడిని ఎలా రప్పిస్తారన్నది ఆసక్తికరంగా మనారింది.
డిసెంబరు 12న హాడీపై దాడి తర్వాత అనుమానితులు దేశం విడిచి పారిపోయారని బంగ్లాదేశ్ (Bangladesh) పోలీసులు పేర్కొన్నారు. వాళ్లు ప్రస్తుతం భారత్‌లో ఉన్నారంటూ ఇటీవల ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. అయితే, వీటిని భారత భద్రతాధికారులు ఖండించారు. అంతర్జాతీయ సరిహద్దు దాటి ఎవరూ భారత్‌లోకి వచ్చినట్లు ఆధారాలు లేవని బీఎస్ఎఫ్ అధికారులు, మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పొరుగుదేశం ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇక, ఈ కేసు విచారణను ఢాకా పోలీసులు వేగవంతం చేశారు. ఈ హత్యకు సంబంధించి అనేక మంది అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. నిందితులు పారిపోయేందుకు సాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.






