‘షహబాజ్’ కే పాక్ పగ్గాలు..
నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ షరీఫ్ ను నామినేట్ చేసింది. దీంతో షహబాజ్ మరోసారి పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగోసారి పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఈ షాకింగ్ నిర్ణయం వెలువడింది. పార్టీ అధికార ప్రతినిధి మారియం ఔరంగజేబు ఎక్స్(ట్విటర్)లో వివరాలు వెల్లడించారు.
తమ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ …తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాక్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ ..బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. అయితే బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని, ఇరు పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో పాక్ ప్రధాని పదవి రేసు నుంచి పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో తాజాగా వైదొలిగినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. పీఎంఎల్-ఎన్ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు.
దీంతో నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలు పొందడంలో తమ పార్టీ విఫలమైందన్నారు బిలావల్ భుట్టో. ఈ కారణంగా ప్రధాని అభ్యర్థిత్వం కోసం పోటీ పడటం లేదని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ తమతో సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించిందన్నారు.
దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం.. పీఎంఎల్-ఎన్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పీఎంఎల్-ఎన్తో తమ అనుభవం బాగా లేదని, సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తమ సమస్యలను ఆ పార్టీ పరిష్కరించలేదని భుట్టో గుర్తు చేశారు. అయితే..తన తండ్రి, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని మరోసారి దేశాధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత సమస్యల నుంచి ఆయన దేశాన్ని గట్టెక్కించగల సమర్థుడని తెలిపారు బిలావల్.













