మరో ‘భూమి’..
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అద్భుత విజయాన్ని సాధించింది. ఇది అమెరికా అంతరిక్ష పరిశోధనలకే ఆయువుపట్టుగా భావించవచ్చు. ఇది అమెరికాకు మాత్రమే కాదు..ప్రపంచ మానవాళికి ఓ శుభవార్తే. ఎందుకంటే.. నాసా అంగారకుడిపై ఆక్సిజన్ ను దిగ్విజయంగా ఉత్పత్తి చేసింది. దీనర్థం.. మార్స్ లోనూ ఇక మానవాళి జీవనానికి సంబంధించి తొలి అడుగు పడిందని చెప్పొచ్చు.
అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రయోగం విజయవంతంగా ముగిసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రకటించింది. పర్సెవరెన్స్ రోవర్‌లోని మాక్సీ(మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్) పరికరం తుది అంకంగా 16వ సారి ప్రాణవాయువును ఉత్పత్తి చేసిందని నాసా వెల్లడించింది. ‘‘అరుణ గ్రహంపై ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే పరీక్ష విజయవంతమైంది. అంగారకుడిపైకి మానవ సహిత యాత్రలకు ఇది మార్గం సుగమం చేస్తుంది’’ అని నాసా ట్విటర్లో తెలిపింది.
2021లో అంగారకుడిపై దిగినప్పటి నుంచి ఆక్సిజన్‌ను మాక్సీ ఉత్పత్తి చేస్తోంది. ఈ పరికరం ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియ ద్వారా అక్కడి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అణువుల్లోని ఒక్కో ఆక్సిజన్ పరమాణువును వేరు చేసింది. ఆ తర్వాత ఆ వాయువులను విశ్లేషించి ఉత్పత్తి అయిన ఆక్సిజన్ పరిమాణం, స్వచ్ఛతను పరీక్షించారు. ఈ పరికరం ఇప్పటివరకూ మొత్తం 122 గ్రాముల ప్రాణవాయువును తయారు చేసింది. ఇది ఈ ప్రయోగ నిర్దేశిత లక్ష్యానికి రెట్టింపు కావడం విశేషం. ఉత్పత్తి అయిన ప్రాణవాయువు 98 శాతం స్వచ్ఛతతో ఉంది.
అంగారకుడిపై వ్యోమగాములు జీవించడానికి, అక్కడి వనరులను వినియోగించుకోవడానికి ఈ సాంకేతికత వీలు కల్పిస్తుందని నాసా తెలిపింది. మాక్సీ లాంటి పరికరం ద్వారా ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను ద్రవీకరించి నిల్వ చేయగలిగే పూర్తిస్థాయి వ్యవస్థ నిర్మాణంపై తదుపరి దృష్టి పెట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అంగారకుడిపై మానవాళి జీవించే పరిస్థితులకు సంబంధించి కొన్నేళ్లుగా నాసా పరిశోధనలుసాగుతున్నాయి. అయితే .. ప్రధానంగా అక్కడ ఆక్సిజన్ లేమితో.. జీవం జీవించడం కష్టమన్న నిర్దారణకు పరిశోధకులు వచ్చారు. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో.. ఇక అక్కడ కూడా మనిషి బతికేందుకు అవకాశం ఉందన్న ఆశలు పెరుగుతున్నాయి. అయితే ఈవ్యవస్థను పెద్దఎత్తున అభివృద్ధి చేయగలిగితే.. ఇక మార్స్ కూడా మరో భూమి అయ్యే అవకాశాలున్నాయి. అంతే మనిషి ఆవాసానికి మరో భూమి దొరికినట్లే.













