‘మహా’ గులాబీ..
మహారాష్ట్ర లో రెండురోజుల పర్యటనకు కేసీఆర్ వెళ్లిన తీరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2 బస్సులు, 600కార్ల భారీ కాన్వాయ్ తో కేసీఆర్, మంత్రులు.. మహారాష్ట్రలో పర్యటించారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని కేసీఆర్ ప్రశ్నించారు. అన్ని వనరులూ ఉన్న మహారాష్ట్ర ఇంకెంతో అభివృద్ధి చెందాలన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోలాపూర్ జిల్లా సర్కోలీలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
పండరీ దర్శనం కోసం వస్తే.. దర్శనం చేసుకోండి.. కానీ రాజకీయం చేయకండి అన్నారని కొందరు నేతలు అన్నట్లు కేసీఆర్ తెలిపారు. మహా నేతలు ఎందుకు ఆక్రోశానికి లోనవుతున్నారని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. మేం ఎవరి టీమ్ కాదు.. కిసాన్ టీమ్ మాది.. అల్పసంఖ్యాకుల టీమ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ భవిష్యత్ ఆశాజనకంగా ఉందన్నారు.
ఇంత భారీకాన్వాయ్ తో కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించడంపై.. మరాఠీ పార్టీలు స్పందించాయి. ఓటమి భయంతోనే కేసీఆర్ .. మహారాష్ట్రకు పరిగెత్తివచ్చారని ఉద్దవ్ పార్టీనేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే, కేసీఆర్ ఓటమి ఖాయమైందని.. అక్కడ కాంగ్రెస్ లో చేరికలు పెద్దఎత్తున జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని.. అందుకే మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేద్దామని భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అయితే మరాఠీ ప్రజలు.. కేసీఆర్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదన్నారు. మహారాష్ట్రలో పార్టీలు బలంగా ఉన్నాయన్నారు. ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ లేదన్నారు.
బీజేపీకి, బీఆర్ఎస్ బీటీమ్ అంటున్న మహారాష్ట్ర పార్టీలు.. ఇక్కడ ప్రజల ఓట్లను చీల్చి కమలం పార్టీకి లాభం చేయాలని బీఆర్ఎస్ చూస్తోందని మహారాష్ట్ర పార్టీలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి బీజేపికి వ్యతిరేకంగా కూటమి కడుతుంటే.. కేసీఆర్ మాత్రం బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నారని ఆరోపిస్తున్నాయి. కూతురు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పీకల్లోతులో ఇరుక్కుపోవడంతో.. ఆమెను కాపాడుకోవడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని ఆరోపిస్తున్నారు. గతంలో కేసీఆర్ కు పోరాటనేతగా పేరుండేదని.. ఇప్పుడు పరిస్థితి చూస్తే , మోడీకి గులాంగిరీ చేసేందుకు నానా పాట్లు పడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.













