టెర్రరిస్ట్ పాలిటిక్స్….
ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా అడ్డాగా మారుతోందా? కెనడాతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు… ఉద్దేశ్యపూర్వకంగా ఖలిస్తాన్ అనుకూలవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయా? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్… ఇదే విషయమై చేస్తున్న ఫిర్యాదులను సైతం తేలిగ్గా తీసుకుంటున్నాయా? సమస్యను పరిష్కరంచాల్సిన కెనడా ఆధ్యక్షుడే .. దీన్ని చాలా చిన్నవిషయంలా తీసిపడేయడాన్ని ఎలా చూడాలి? తలనొప్పిగా మారిన ఈ అంశాన్ని భారత్ ఎలా పరిష్కరించనుంది..? ఇప్పుడు చాలా మంది భారత దౌత్యవేత్తలకు ..ఇదే ఆందోళన కలుగుతోంది.
ఓట్ల కోసం ఖలిస్థాన్ అనుకూలవాదులపై మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ భారత్ తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో అన్నారు. తమది చాలా వైవిధ్యభరిత దేశమని, భావప్రకటన స్వేచ్ఛను ఎల్లప్పుడూ గౌరవిస్తామని తెలిపారు. అయితే హింస, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 8న కెనడాలో ‘ఖలిస్థాన్ స్వాతంత్య్ర ర్యాలీ’ నిర్వహిస్తామంటూ స్థానికంగా పోస్టర్లు వెలిసినవేళ.. ట్రుడో ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రుడో వ్యాఖ్యలకు భారత్ ఘాటుగా స్పందించింది. ఇక్కడ సమస్య భావప్రకటన స్వేచ్ఛ గురించి కాదు. హింస, వేర్పాటువాదాన్ని ప్రచారం చేసుకోవడానికి.. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి ఆ స్వేచ్ఛ దుర్వినియోగమవుతోంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.. మరోవైపు లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడులు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కావని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ స్పష్టం చేశారు. హైకమిషన్ సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రధానమని తెలిపారు.
కెనడా, బ్రిటన్, ఆస్ట్లేలియా, ఇంగ్లండ్ దేశాల్లో సిక్కుల సంఖ్య గణనీయంగా ఉంది. దీంతో వారు మెజార్టీ ఓటు బ్యాంకుగా మారారు. వీరిని ఆకట్టుకోవడం కోసం అక్కడి పార్టీలు సైతం.. ప్రయత్నాలు చేస్తున్నాయి. భావప్రకటన స్వేచ్ఛలో భాగంగా వీరు అతివాదాన్ని, ఉగ్రవాద భావనలను ప్రచారం చేస్తున్నా కిమ్మనడం లేదు. దీంతో సిక్స్ ఫర్ జస్టిస్ లాంటి సంస్థలు.. భారత్ పై విషప్రచారం ముమ్మరం చేశాయి. దీనికి పాకిస్తాన్ ఐఎస్ఐ తెరవెనక సహకరిస్తోంది. ఈ పరిణామం భారత్ కు ఆందోళన కలిగిస్తోంది.













