హర్మూజ్ కు కొత్త నిబంధనలు తెస్తామంటున్న ఇరాన్…!
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదరడం ప్రపంచానికి కాస్త ఆశకలిగిస్తున్నా.. అవి పరస్రపం విసురుకుంటున్న సవాళ్లు, విమర్శలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ రెండుదేశాల మధ్య ఎప్పుడు శాశ్వత శాంతి ప్రక్రియ మొదలవుతుందా అని ప్రపంచం యావత్తూ ఆశగా ఎదురుచూస్తోంది. అయితే అమెరికా, ఇరాన్ మాత్రం.. మామాటే నెగ్గాలన్న మొండి పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా… తాము రాసిన స్క్రిప్ట్ పై ఇరాన్ సంతకాలు చేయాలన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఈ తరుణంలో ‘‘పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)కి కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది’’ అని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
టెహ్రాన్‌తో అణుఒప్పందం కుదిరేవరకు హర్మూజ్‌లో తమ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చెప్తున్నారు. అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపదగా కాపాడుకుంటామని తాజా ప్రకటనలో మొజ్తాబా తేల్చిచెప్పారు. ‘‘దేవుడి దయవల్ల పర్షియన్ గల్ఫ్ ఉజ్వల భవిష్యత్తులో అమెరికా ఉండదు. హర్మూజ్ కోసం కొత్త నిబంధనలు తీసుకువస్తాం. అవి గల్ఫ్ దేశాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడంతో పాటు ప్రశాంతత, పురోగతిని తీసుకు వస్తాయి. దురాశతో మా జలాల వద్దకు వచ్చే విదేశీయులకు (అమెరికా, ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి) సముద్రం అడుగున మినహా ఇంకెక్కడా స్థానం ఉండదు’’ అని సుప్రీం లీడర్ హెచ్చరించారు. అంతేకాదు…. ‘‘ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా బేస్‌లు వాటిని అవే కాపాడుకోలేకపోతున్నాయి. అలాంటప్పుడు తమపై ఆధారపడిన దేశాల భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వగలవు’’ అని ఖమేనీ (Irans Supreme Leader Mojtaba Khamenei) ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అమెరికా బలగాలు అడ్డుకుంటోన్న సంగతి తెలిసిందే. హర్మూజ్‌లో తమ దిగ్బంధనాన్ని దాటుకొని వెళ్లాలని ప్రయత్నించిన 42 నౌకలను అడ్డుకున్నామని యూఎస్ మిలిటరీ వెల్లడించింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి హబ్ అయిన ఖర్గ్ ఐలాండ్‌ను చమురుతో ముంచేసి, ఒప్పందం చేసుకునేలా ఒత్తిడి తేవాలన్న ఎత్తుగడతోనే అగ్రరాజ్యం ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు టెహ్రాన్ ఉత్పత్తి చేస్తోన్న చమురును ఖర్గ్లో నిల్వ చేసే సామర్థ్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఎగుమతులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి సమయంలో కొత్త ఆయుధంతో అమెరికాకు హార్ట్ ఎటాక్ తెస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి








