ఖలిస్తాన్ తలనొప్పులు..
పంజాబ్ లోని ఖలిస్తాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడుపోసుకుంటుందా? విదేశాల్లోని ఖలిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు.. ఉగ్రవాదాన్ని రాజేసేందుకు ప్రయత్నిస్తున్నాయా? కెనడా, ఇంగ్లండ్, అమెరికాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న ఖలిస్తాన్ అనుకూల సంస్థలు.. భారతదేశంపై విషప్రచారం చేస్తున్నాయా? మరి వీటికి చూస్తూ ఆయా దేశాలు ఎలా అనుమతిస్తున్నాయి? భారత్ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా, ఎందుకు ఫలితం లేకుండా పోతోంది.
కెనడాలోని ఒట్టావాలో ఉన్న ఇండియన్ హైకమిషన్ కార్యాలయం, టొరంటో, వాంకోవర్ నగరాల్లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాల వద్ద ఈ నెల 8న నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఖలిస్థాన్ అనుకూల సిక్కు ఉగ్రవాద సంస్థలు ప్రకటించాయి. దీనిపై భారత ప్రభుత్వం జస్టిన్ ట్రుడు నేతృత్వంలోని కెనడా ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. సిక్కు ఉగ్రవాదులు భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించకుండా, ఇండియన్ మిషన్స్, కాన్సులేట్లకు సమీపంలోకి ఈ ఉగ్రవాదులు చేరుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కార్యాలయాల్లో పని చేసే దౌత్యవేత్తలు, ఇతర సిబ్బందికి ఎటువంటి సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేయాలని కోరింది.గతంలోలా ప్రహరీ గోడలపై ఎటువంటి కరపత్రాలు అంటించకుండా, రాతలు రాయకుండా, ప్రొజెక్టైల్స్‌ను కార్యాలయాల్లోకి విసరకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీలోని కెనడియన్ హైకమిషనర్‌ను పిలిపించిన భారత ప్రభుత్వం … సిక్కు ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు నోట్ వెర్బల్ ను గ్లోబల్ ఎఫైర్స్ కెనడాకు పంపించింది. ఈ ఏడాది మార్చి 23న సిక్కు ఉగ్రవాదులు ఇండియన్ హై కమిషన్ ప్రాంగణంలోకి రెండు స్మోక్ గ్రెనేడ్లను విసిరినట్లు గుర్తు చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు టొరంటో, వాంకోవర్ నగరాల్లో నిరసనల సందర్భంగా భారత దేశ జాతీయ పతాకాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
ఇండియా ప్రభుత్వం విజ్ఞప్తికి కెనడా స్పందించింది. వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్యవేత్తలకు గట్టిభద్రత కల్పిస్తున్నామని వివరించింది. భారతీయ ఎంబసీ అధికారులతో టచ్ లో ఉన్నామన్న కెనడా విదేశాంగమంత్రి మిలన్ జోలీ… రాయభార కార్యాలయ దగ్గర ఆందోళనలు, సోషల్ మీడియాలో ప్రచారం లాంటి వాటిని అంగీకరించమన్నారు. ఇలాంటి వాటికి పాల్పడేవారిపై చర్యలు ఉంటాయన్నారు.
అయితే..అమెరికాలోని సిక్స్ ఫర్ జస్టిస్ ఈ నిరసనలను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ప్రధాన అనుబంధ సంస్థ కెనడాలో ఉంది. దీనిలో క్రియాశీలకంగా ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోని వాంకోవర్‌లో జూన్ 19న హత్య చేశారు. ఇంటర్ గ్యాంగ్ ఘర్షణలో ఈ హత్య జరిగినప్పటికీ, ఇది భారత దేశ అధికారుల పనేనని ఎస్ఎఫ్జే ఆరోపిస్తూ, సిక్కు యువతను రాడికలైజ్ చేస్తోంది. పాశ్చాత్య దేశాల్లోని భారతీయ మూలాలుగలవారిపైకి వీరిని ఉసిగొలుపుతోంది. నిజ్జర్ హత్యకు కారకులు ఇండియన్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, వాంకోవర్ కాన్సుల్ జనరల్ మనీశ్, టొరంటో కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ అని కరపత్రాలను పంచుతోంది.
ఎస్ఎఫ్జే ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ కార్యకలాపాల్లో భాగంగానే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఈ ఉగ్రవాదికి కెనడా, యూకే తదితర పాశ్చాత్య దేశాల్లో ప్రాపకం లభిస్తోంది. అక్కడి ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. మరోవైపు…జూలై ఎనిమిదిన జరిగే నిరసనల్లో భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించినా, తగులబెట్టినా తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.













