సెకండ్ వేవ్ కు కారణాలేంటి? భారత్ చేతులెత్తేసిందా?
నెలరోజుల్లో ఎంత మార్పు? అలసత్వం, నిర్లక్ష్యం.. ఎంతటి ప్రభావం చూపిస్తాయనేందుకు ప్రస్తుతం భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొదటి వేవ్ ను భారత్ సమర్థంగా ఎదుర్కొందని ప్రపంచదేశాలన్నీ పొగిడాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ లో కరోనా విలయతాండవం చేస్తుందని అందరూ భావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ లో కరోనా విజృంభణపై అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ కరోనాను సమర్థంగా ఎదుర్కొంది భారత్. దీంతో ప్రపంచమంతా భారత్ ను వేనోళ్లపొగిడింది.
గతేడాది సెప్టెంబర్ లో గరిష్టంగా రోజుకు లక్షవరకూ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరికి వచ్చేసరికి ఆ సంఖ్య 11 వేలకు పడిపోయింది. దీంతో భారత్ లో కరోనా పనైపోయిందనుకున్నారు. అందుకే.. మార్చి ఆరంభంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్.. భారత్ లో కరోనా మహమ్మారి శకం ముగిసిందని ప్రకటించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ డిప్లొమసీలో భాగంగా విదేశాలకు సైతం టీకాలను ఎగుమతి చేసింది భారత్. ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుందని సంబర పడ్డారు. మోదీని వ్యాక్సిన్ గురుగా అభివర్ణించారు. అన్నీ పాజిటివ్ గా సాగుతుండడంతో దేశం మొత్తం కరోనా ముందునాటి పరిస్థితుల్లోకి వచ్చేసింది.
ఎన్నికలు కొంపముంచాయా?
అయితే.. ఫిబ్రవరి చివర్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఇవి మినీ సార్వత్రిక ఎన్నికలు. సుమారు 19 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. మార్చి 27 నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సుదీర్ఘ ఎన్నిక్ల ప్రక్రియ ఇది. మే 2 వరకూ సాగనుంది. బెంగాల్ లో అయితే ఏకంగా 8 విడతల పాటు పోలింగ్ జరిగేలా షెడ్యూల్ ప్రకటించారు. ప్రచారానికే నెలరోజులకు పైగా సమయం కేటాయించారు. ఇంకేముందు.. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాలను హోరెత్తించాయి. భౌతికదూరం లేదు.. శానిటేషన్ లేదు.. మాస్కులులేవు.. పార్టీల సంబరం అంబరాన్నింటింది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలలో ప్రధాని మొదలు ప్రాంతీయ పార్టీల నేతలందరూ విస్తృతంగా పర్యటించారు. నేతలే ఆస్థాయిలో పర్యటిస్తుంటే ఇక కార్యకర్తలు ఆగుతారా? ఇదే సమయోం భారత్ – ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్ సాగింది. హంగూ ఆర్భాటాలతో నిర్మించిన గుజరాత్ – అహ్మదాబాద్ స్టేడియంలోకి లక్ష 30వేల మంది ప్రేక్షకులను అనుమతించారు. ఏప్రిల్ లో కుంభమేళా కూడా స్టార్ట్ అయింది.
నెల రోజుల్లో సీన్ రివర్స్!
ఇంకేముంది.. నెలరోజుల్లో సీన్ మొత్తం రివర్స్. ఏప్రిల్ రెండో వారం నుంచి కేసులు భారీగా పెరుగడం మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు లక్షకు పైగా కేసులు రికార్డయ్యాయి. ఇప్పుడు రోజుకు సుమారు 3 లక్షల కేసులు నమోదవుతున్నయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తోంది. అమెరికా, బ్రెజిల్ లను దాటి గరిష్ట కేసులు నమోదు చేస్తోంది. దీంతో భారత్ తో అన్ని మార్గాలను మూసేస్తున్నాయి విదేశాలు. భారత్ తో రాకపోకలపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రస్తుత సెకండ్ వేవ్ ప్రభావం మరో ఐదారు వారాల పాటు కొనసుగుతుందనే అంచనాలున్నాయి. ఇప్పుడు రోజుకు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. జూన్ నాటికి ఈ సంఖ్య 2350కి చేరుతుందని ప్రముఖ లాన్సెట్ మేగజైన్ అంచనా వేసింది.
దేశంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. అయినా లాక్ డౌన్ విధించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. మొదటి విడతలో లాక్ డౌన్ వల్లే కరోనాను అడ్డుకోగలిగామన్న కేంద్రం.. ఇప్పుడు మాత్రం కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదంటోంది. దీంతో కరోనా కట్టడికి రాష్ట్రాలే స్వచ్చంధంగా లాక్ డౌన్ ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఇవాల్టి నుంచి ఢిల్లీలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. మహారాష్ట్ర కూడా రేపోమాపో లాక్ డౌన్ కు సిద్ధమవుతోంది. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి.
ప్రజారోగ్యం దయనీయం!
ఇక రాష్ట్రాల్లో పబ్లిక్ హెల్త్ పరిస్థితి దయనీయంగా మారింది. ఆసుపత్రులన్నీ నిండుకున్నాయి. అత్యవసర బెడ్స్ కూడా అందుబాటులో లేవు. రెమిడెసివర్ లాంటి అత్యవసర మందులు కూడా దొరకట్లేదు. ప్రాణవాయువైన ఆక్సిజన్ కూ కొరత ఏర్పడింది. అత్యవసర మందులను బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకోవడం ప్రారంభమైంది. స్మశానాల్లో శవాల క్యూ కనిపిస్తోంది. ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా పేరొందిన మన దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్ కూడా కొరత ఏర్పడింది. రోజుకు వంద మిలియన్ డోసులు ఉత్పత్తి అవుతున్నా.. కొరత ఏర్పడుతోంది. తమకు సరిపడా వ్యాక్సిన్లు రావట్లేదని రాష్ట్రాలు కేంద్రాన్ని దుయ్యబడుతున్నాయి. కేంద్రం తమపై పక్షపాతం చూపిస్తోందని పలు రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. అవసరానికి సరిపడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతున్నామని సీరమ్ ఇనిస్టిట్యూట్ చేతులెత్తేసింది. అందుకు తమ దగ్గర ఆర్థిక వనరులు లేవని చెప్పేసింది. మరోవైపు.. ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎగుమతిపై భారత్ తాత్కాలిక నిషేధం విధించింది. అంతేకాక.. దేశీయ అవసరాలకోసం విదేశీ టీకాలకు అత్యవసర అనుమతులు మంజూరు చేస్తోంది. సీరమ్, భారత్ బయోటెక్ లకు 4500 కోట్ల రుణం మంజూరు చేసింది. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్లాంట్ లు ఏర్పాటు చేస్తోంది. పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ నిలిపేసింది.
కరోనా సెకండ్ వేవ్ కు కారణాలేంటంటే ఒకటని చెప్పలేం. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టగానే జనం సేఫ్టీ మెజర్స్ ని గాలికొదిలేశారు. మాస్కులు లేకుండా తిరగడం మొదలు పెట్టారు. వ్యాక్సిన్ వచ్చేసిందన్న ధీమా మరింత నిర్లక్ష్యానికి కారణమైంది. మరణాలు తగ్గడం, కేసుల సంఖ్య క్షీణించడంతో కరోనా తమనేం చేయలేదనే కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇంతలోనే ఎన్నికలు రావడం.. ప్రచారాలు హోరెత్తడం.. వాటికి జనం విపరీతంగా హాజరవడం.. లాంటి పరిణామాలు కరోనా సెకండ్ వేవ్ కు బాటలు పరిచాయి. ఇక కుంభమేళా మరొక ఎత్తు. లక్షలాదిమంది భక్తులు పోటెత్తారు. కుంభమేళాలో సాధువులే సుమారు 300 మంది కరోనా బారిన పడ్డారు. 3వేల మందికి పైగా భక్తులు మహమ్మారికి చిక్కారు. మరోవైపు.. లాక్ డౌన్ పెట్టేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. దీంతో రాష్ట్రాలే ఆంక్షలు విధించుకుంటున్నాయి. దీంతో సెకండ్ వేవ్ పై కేంద్రం చేతులెత్తిసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.













