Trump Jr: బెట్టినా ఆండర్సన్‌తో ట్రంప్ జూనియర్ ఎంగేజ్ మెంట్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ .. తన కిష్టమైన బెట్టీనా ఆండర్సన్ తో వివాహ నిశ్చితార్ధం చేసుకున్నారు. తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌తో నిశ్చితార్థం అయినట్లు వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ట్రంప్ జూనియర్ ప్రకటించారు (Donald Trump Jr announces engagement). ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర ప్రభుత్వ అధికారులు, నేతలు పాల్గొన్నారు.
ట్రంప్ జూనియర్ 2005లో వెనెసాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో 13 ఏళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2018లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. అనంతరం ట్రంప్ జూనియర్‌కు 2020లో ఫాక్స్‌న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో నిశ్చితార్థం జరగ్గా.. తర్వాత దానిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మోడల్, సామాజికవేత్త అయిన బెట్టినా ఆండర్సన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఉదయ్పుర్లో జరిగిన ఎన్నారై బిలియనీర్ రామలింగరాజు మంతెన కుమార్తె నేత్ర వివాహంలోనూ ట్రంప్ జూనియర్ బెట్టినా ఆండర్సన్‌తో కలిసి సందడి చేశారు.
బెట్టినా ఆండర్సన్ ఎవరు?
ట్రంప్ జూనియర్‌కు కాబోయే భార్య బెట్టినా ఆండర్సన్.. హ్యారీ లాయ్ ఆండర్సన్-ఇంగర్ ఆండర్సన్‌ల కుమార్తె. హ్యారీ అమెరికాలో బ్యాంక్ అధ్యక్షుడు. 26 ఏళ్ల వయసులో వర్త్ అవెన్యూ నేషనల్ బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. బెట్టినా ఆండర్సన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో పెరిగింది. 1986, డిసెంబర్లో జన్మించింది. బెట్టినాకు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. బెట్టినా 2009లో కొలంబియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైంది. వృత్తి రీత్యా మోడల్.






