బైడెన్ స్ట్రాటజీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ట్రంప్ హవా కొనసాగుతోంది. ప్రతీ సర్వే పోల్ లోనూ ట్రంప్ నకు అనుకూలంగా జనాభిప్రాయం కనిపిస్తోంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీలోనూ ట్రంప్ కు ఎదురులేకుండా ఉంది. పార్టీలోని అభ్యర్థులపై ట్రంప్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. అయితే ట్రంప్ పై అనేక కేసులు పెండింగ్ లో ఉండడంతో.. పోటీకి అవకాశం ఉంటుందా అన్నది అనుమానంగా మారింది. కానీ.. ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్ మాత్రం… తనకు ట్రంప్ తోనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ట్రంప్ పై దాడి మొదలుపెట్టేశారు.
గత ఎన్నికల్లో ట్రంప్ పై అమెరికన్లలో భయాన్ని డెమొక్రాట్లు సొమ్ము చేసుకున్నారు. ట్రంప్ పై బిడెన్ గట్టెక్కారు. కానీ ఈసారి ఆపరిస్థితి కనిపించడం లేదు. దీంతో మరోసారి ట్రంప్ టార్గెట్ గా బిడెన్ విమర్శలు సంధించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సహచరులు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పని ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. దేశ ప్రధాన విలువలను బలోపేతం చేయడం కంటే.. వ్యక్తిగత శక్తిని పెంచుకోవడంపైనే ఆయనకు ఆసక్తి ఉందని.. ఇందుకు రిపబ్లికన్లు కూడా సహకరిస్తున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు. వారి మౌనం దీనిని సూచిస్తోందన్నారు.
అరిజోనాలో తన సహచరుడు దివంగత జాన్ మెకైన్ స్మారకార్థం చేపట్టిన లైబ్రరీ నిర్మాణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూనే.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే ప్రచార థీమ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. గత మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఓడిపోవడంతో.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఈ ఆలోచనను మరోసారి ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాకు ఏదో ప్రమాదం పొంచి ఉందని బైడెన్ అనుమానం వ్యక్తం చేశారు. ‘తుపాకీ గొట్టాలతో ప్రజాస్వామ్యాన్ని చంపలేరు.. కేవలం ప్రజల మౌనం వల్లే అవి చనిపోతాయి. ప్రజలు భ్రమలకు, నిరాశకు, వివక్షకు గురైనప్పుడు వారికి అత్యంత ముఖ్యమైన దానిని వదులుకోవడానికి సిద్ధపడతారు’ అని అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దాదాపు ఏడాదికిపైగా సమయం ఉంది. కానీ, ప్రధాన పోటీదారుగా ట్రంప్ ఉంటారని బైడెన్ భావిస్తున్నారు. ట్రంప్‌పై ఎన్ని ఆరోపణలున్నా.. రిపబ్లికన్లు ఆయనకు మద్దతుగా ఉన్నారని బైడెన్ అంచనా వేస్తున్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యానికి ముప్పును ప్రస్తావిస్తూ బైడెన్ ప్రసంగించడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రస్తుతం అమెరికాలో బైడెన్ రేటింగ్స్ పడిపోవడం, అయన వయస్సు 80 దాటడంతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి పదవిలో కొనసాగడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన పోటీ ఇచ్చేందుకు బైడెన్ యత్నాలు తీవ్రం చేశారు. కిందటి మిడ్‌టర్మ్ ఎన్నికల్లో మాదిరిగా ట్రంప్‌పై ఎదురుదాడిని బైడెన్ నమ్ముకొన్నారు.






