కర్నాటక బీజేపీకి కష్టకాలం..! ఆదుకునేదెవరు..?
ఎన్నికల వేళ కర్నాటక రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఎత్తులు పైఎత్తులలో మునిగిపోయాయి. ఇందులో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధిస్తోంది. దేశవ్యాప్తంగా తన హవా కొనసాగిస్తున్న బీజేపీ.. కర్నాటకలో మాత్రం చతికిలపడుతోంది. రోజురోజుకూ ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. ఎవరు ఎప్పుడు షాక్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. కీలక నేతలు పార్టీని వీడుతుండడం కమలం పార్టీని కలవరపెడుతోంది.
ఎన్నికలను ఎదుర్కోవడంలో బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఏడాది ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటుంది. వ్యూహాలు పన్నడంలో కమలం పార్టీ నేతలు సిద్ధహస్తులు. ఎలాగైనా అధికారంలోకి దక్కించుకోవాలనే తపన ఆ పార్టీలో కనిపిస్తుంది. ఇందుకోసం పక్క పార్టీలను చీల్చడం, కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడం, ఇతర పార్టీలను రంగంలోకి దించి ఓట్లు చీల్చి లబ్ది పొందడం.. లాంటివి అమలు చేయడంలో బీజేపీ ఎంతో పేరొందింది. కానీ కర్నాటకలో మాత్రం ఆ పార్టీ వ్యూహాలు వర్కవుట్ కావట్లేదు.
కర్నాటక బీజేపీకి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పదని మొదటి నుంచి సర్వేలు చెప్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఆ పార్టీ నేతలు పలువురు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్సీలు కమలం పార్టీని వీడడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఎన్నికల వేళ బీజేపీకి ఇది ఏమాత్రం మింగుడు పడని అంశం. పైగా వెళ్లిన వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో ఆ పార్టీ బలం పెరుగుతోంది. దీంతో బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది.
ఇదే సమయంలో బీజేపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సయోధ్య లేదు. ఇటీవల యడ్యూరప్ప ర్యాలీని సైతం నేతలు అడ్డుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధిష్టానం ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయట్లేదు. యడ్యూరప్పను ఇన్నాళ్లూ పక్కన పెట్టి ఇప్పుడు వాడుకుంటున్నా పరిస్థితిలో మార్పు లేదు. మరోవైపు సీఎం బస్వరాజ్ బొమ్మై మాట కూడా నెగ్గట్లేదు. ఆయన మాట కూడా నేతలు వినట్లేదు. ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలో మరింత మంది నేతలు పార్టీని వీడడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













