కర్నాటకలో కమలం పార్టీకి కష్టకాలం..! బరిలో భారీగా రెబెల్స్..!?
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లో జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. సీట్లు ఖరారైన నేతలు ఇప్పటికే ప్రచారంలో బిజీ అయిపోయారు. సీట్లు దక్కని నేతలు హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు పార్టీలు కూడా సీట్లు కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రత్యర్థులను బేరీజు వేసుకుని కేండిడేట్స్ ను అనౌన్స్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ఇప్పటికే మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే బీజేపీకి మాత్రం అసంతృప్తుల బెడద వెంటాడుతోంది.
కర్నాటక బీజేపీకి పట్టున్న ఏకైక సౌతిండియా రాష్ట్రం. ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఈసారి కూడా ఎలాగైనా దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది. అయితే బీజేపీపై వ్యతిరేకత ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. బీజేపీ పాలనపై ప్రజలు ఏమాత్రం సంతృప్తిగా లేరని ఒపీనియన్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అభ్యర్థుల ఎంపికలో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ ప్లాన్ బెడిసికొట్టినట్టు కనిపిస్తోంది. చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక వివాదాలకు కారణమవుతోంది.
బీజేపీ మొదటి విడతలో 189 స్థానాలకు, రెండో విడతలో 23 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వీళ్లలో 18 మంది సిట్టింగులకు సీట్లు నిరాకరించింది. ఇందులో మాజీ సీఎం జగదీశ్ షట్టర్, మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప తదితరులు కూడా ఉన్నారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు సీట్లు కేటాయించడం, ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు ఆయా స్థానాల్లో మొండిచేయి చూపడంతో నేతలు ఫుల్ ఫైర్ లో ఉన్నారు. బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో హొసదుర్గ ఎమ్మెల్యే శేఖర్.. గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇలాగే మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు.
బీజేపీ పాలనపై ఇప్పటికే వ్యతిరేకత బాగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అవినీతి బాగా ఎక్కువైందని వార్తలు వస్తున్నాయి. అంతేకాక పార్టీని దశాబ్దాలపాటు నడిపించిన యడ్యూరప్పను పక్కన పెట్టడం లింగాయత్ సామాజిక వర్గానికి ఏమాత్రం రుచించడంలేదు. అలాగే హిజాబ్ లాంటి అంశాలు బీజేపీపై వ్యతిరేకతను పెంచేశాయి. ఇప్పుడు అంతర్గత పోరు అధికం అయింది. చాలా మంది నేతలు పక్క పార్టీల్లో చేరేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. అక్కడ కూడా సీట్లు రాకపోతే రెబెల్స్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది బీజేపీకి పెద్ద సమస్యగా మారింది.













