రిషి సునక్ ముందు ఎన్నో సవాళ్లు.. ఎదుర్కోగలరా..?
ఒకప్పుడు బ్రిటీష్ వాళ్లది రవి అస్తమించని సామ్రాజ్యం. అయితే ఇప్పుడా సామ్రాజ్యం లేదు. మనల్ని వందేళ్లకు పైగా పాలించి.. మన సంపదనంతా దోచుకుంది బ్రిటీష్ సామ్రాజ్యం. ఒక్క భారతదేశాన్నే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలను ఏలింది బ్రిటీష్ రాజ్యం. అయితే ఇప్పుడు ఆ బ్రిటీష్ సామ్రాజ్యానికే బీటలు వాలాయి. ఇన్నాళ్లూ ప్రపంచంపై తమదే ఆధిపత్యం అని విర్రవీగిన సామ్రాజ్యం ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ఇప్పుడు అదే సామ్రాజ్యానికి మనోడు ప్రధాన మంత్రి అవుతున్నాడు. మనల్ని ఏలినవాళ్లను ఏలబోతున్నాడు. అతనే రిషి సునాక్. యునైటెడ్ కింగ్ డమ్ చరిత్రలో తొలిసారి ఓ తెల్లజాతి కాని వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు.
రిషి సునక్.. గత నెలలో ఈ పేరు ప్రముఖంగా వినిపించింది. బ్రిటన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో రిషి సునక్.. లిజ్ ట్రస్ తో పోటీ పడ్డాడు. అయితే కన్జర్వేటివ్ పార్టీ నేతలు జాత్యహంకారంతో రిషి సునక్ ను కాదని లిజ్ ట్రస్ నే ప్రధానిగా ఎన్నుకున్నారు. దీంతో రిషి సునక్ ఓడిపోయారు. అయితే ఇప్పుడు బ్రిటన్ కు రిషి సునకే దిక్కయ్యాడు. గత నెలలో ఓడించిన ఎంపీలే ఇప్పుడు రిషి సునక్ కు పట్టం కట్టారు. లిజ్ ట్రస్ ను మించిన మెజారిటీతో గెలిపించారు. ప్రస్తుత పరిస్థుతుల్లో బ్రిటన్ ను గట్టెక్కించగలగే సత్తా రిషి సునక్ కు మాత్రమే ఉందని భావిస్తున్నారు. అందుకే జాత్యహంకారాన్ని పక్కన పెట్టి సునక్ ను ఎంచుకున్నారు.
రిషి సునక్ భారతీయ మూలాలున్న వ్యక్తి. వాళ్ల కుటుంబం పంజాబ్ నుంచి 1960ల్లో ఆఫ్రికాకకు వలస వెళ్లింది. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లి స్థిరపడింది. 1980లో సునక్ బ్రిటన్ లోనే జన్మించాడు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఆర్.నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తిని రిషి సునక్ పెళ్లి చేసుకున్నాడు. 2015లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు రిషి సునాక్. ఎంపీగా గెలిచిన తొలిసారే రిషి సునక్ ప్రధానిగా ఎంపికవ్వడం ఓ రికార్డ్. అయితే బ్రిటన్ లో అత్యంత సంపన్నుడిగా పేరొందారు రిషి సునక్. ఇదే ఆయనకు పెద్ద అవరోధంగా మారింది. అంతేకాక హిందూ కావడం, బ్రిటనేతర వ్యక్తి కావడం.. లాంటి అంశాలు ఆయన ప్రధాని కావడానికి ఆటంకాలుగా మారాయి. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు రిషి సునక్. తనను ఎంత వ్యతిరేకించినా ఎక్కడా వెనుకంజ వేయలేదు. అవమానాలను ఎదుర్కొంటునూ ఎదురీదారు. చివరకు విజయం సాధించారు.
అయితే రిషి ముందు ఎన్నో సవాళ్లున్నాయి. బ్రిటన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. గత ప్రధాని లిజ్ ట్రస్ కేవలం నెలరోజుల్లోనే రాజీనామా చేసిందంటే అందుకు కారణం ఆర్థిక వ్యవస్థే. దాన్ని గాడిన పెట్టలేక ఆమె చేతులెత్తేసింది. దీంతో ఆమెపై ఒత్తిడి పెరిగింది. చివరకు రాజీనామాకు దారి తీసింది. ఇప్పుడు రిషి సునక్ ముందు కూడా అదే సవాల్ ఉంది. బ్రెగ్జిట్ నుంచి బయటకు వచ్చాక బ్రిటన్ తన సొంత కాళ్లపై నిలబడేందుకు ఎంతో శ్రమిస్తోంది. అయితే ఇప్పటికీ అది నెరవేరట్లేదు. ఇప్పుడు ఆశలన్నీ రిషి సునక్ వైపే. రిషికి ఆర్థిక రంగంపై మంచి పట్టుంది. రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో పలు పేరొందిన ఆర్థిక సంస్థల్లో పని చేశారు రిషి. అంతేకాక కరోనా సమయంలో సునక్ చేపట్టిన కొన్ని సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో సునక్ పై నమ్మకం కలిగింది. ఇప్పుడు ఆ నమ్మకమే బ్రిటన్ పీఠాన్ని కట్టబెట్టింది. మరి రిషి సునక్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూద్దాం.













