ట్రంప్ దంపతుల మధ్య విభేదాలు?
స్టార్మీ డేనియల్స్ అనే శృంగార తారతో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని, ఈ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు పెద్ద మొత్తంలో ఆయన చెల్లిస్తున్నారనే వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్‌కు, ఆయన సతీమణి మెలానియాకు మధ్య విభేదాలు తలెత్తాయనే వదంతులు వ్యాపించాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు ముగింపు ప్రసంగం ఇచ్చేందుకు ట్రంప్ స్విట్జర్లాండ్ వెళ్లారు. కానీ, ఆ సమావేశానికి మెలానియా హాజరు కాకపోవడం, అలాగే యూఎస్‌లో తొలిసారి కాంగ్రెస్‌లో ప్రసంగించే కార్యక్రమానికి ట్రంప్‌తో కలిసి రాకుండా మెలానియా విడిగా రావడం వంటివి ఆ వదంతులకు ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ స్పందిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులతో మెలానియా ముచ్చటించాలనుకున్నారని, అందుకే, ట్రంప్ వచ్చిన అనంతరం మెలానియా వచ్చారని తెలిపారు.













