కొత్త రైల్వే యాప్‌తో విమాన టిక్కెట్లు
రైల్వేశాఖ ఈ వారంలో ఆవిష్కరించనున్న చరవాణి యాప్ ద్వారా విమాన టిక్కెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు. బహుళ ప్రయోజనాలకు ఉద్దేశించి రూపొందించిన ఈ యాప్ ద్వారా విశ్రాంతి గదులు, పోర్టర్ సేవలు, ఆహార పదార్థాలను కూడా పొందవచ్చు. రూ.7 కోట్లతో క్రిస్ ఈ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే పలు రైల్వే యాప్‌లు ఉన్నప్పటికీ అవన్నీ ఒక్కో సేవను మాత్రమే అందిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు దీన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త యాప్ ద్వారా ట్యాక్సీలు, హోటళ్లను కూడా ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్‌ను రూపొందించనున్నట్లు 2016-17 బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించింది.













