తానా మహావేడుకకు అందరూ రావాలి – సతీష్ వేమన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తరువాత సతీష్ వేమన ఆధ్వర్యంలో జరిగిన ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందిని ఆకర్షించాయి. కమ్యూనిటీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న సతీష్ తన యువ టీమ్‌తో తానాలో సరికొత్తగా కార్యక్రమాలను నిర్వహించి చరిత్ర సృష్టించారు. రెండు రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన తానా చైతన్యస్రవంతి వేడుకల్లో పట్టణాల్లో ఉన్న యువతను, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులను తానావైపు ఆకర్షించేలా చేశారు. సతీష్ వేమన సారధ్యంలో వాషింగ్టన్‌డీసిలో జరిగే 22వ తానా మహాసభలు కూడా మరో చరిత్రను సృష్టించేలా సాగనున్నాయి. గతంలో ఇక్కడే జరిగిన తానా మహాసభల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ పాల్గొనడం అప్పుడు చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే.
వాషింగ్టన్ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు సతీష్ వేమన సారధ్యంలో జరుగుతున్న ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు, మరచిపోలేని మహా వేడుకగా నిర్వహించాలని సతీష్ వేమన భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయన అనేక చర్యలను చేపట్టారు. మహాసభలను పురస్కరించుకుని ఆయనను ‘తెలుగు టైమ్స్’ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలను ఇక్కడ పాఠకులకు అందిస్తున్నాము.
22వ మహాసభల హైలైట్స్ ఏమిటి?
ప్రపంచంలోని తెలుగువారందరినీ ఒకే చోట కలిసేలా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. కాన్ఫరెన్స్ లోగోలోనే మా ఉద్దేశ్యాన్ని తెలియజేశాము. ఐక్యత, నైపుణ్యం, పురోగమనం పేరుతో రూపొందించిన ఈ లోగోలో అమెరికా, కెనడా, భారత్ జెండాలు బ్యాక్‌గ్రౌండ్‌లో పెనవేసుకుని కనిపిస్తాయి. అమెరికాలోని తెలుగువారు, కెనడాలోని తెలుగువారు, భారత్‌లోని తెలుగువారు కలిసి ఈ మహాసభల్లో పాల్గొనాలన్న ఉద్దేశ్యంతో ఈ లోగోను రూపొందించాము. తెలుగువారి ఐక్యతను ప్రతిబింబించే వేడుక ఇది. తెలుగువారి సత్తాను చాటే మహాసభలు ఇవి. తెలుగువారు ఏ రంగంలోనైనా పురోగమిస్తారన్న దానికి ఇక్కడికి వచ్చిన ప్రముఖులే నిదర్శనం. ఇవన్నీ తెలియజేసేలా ఐక్యత, నైపుణ్యం, పురోగమనం అక్షరాలను లోగోపై ముద్రించాము.
అమెరికా చట్టసభల భవనం కాపిటల్ హిల్కుక్, కాకతీయ తోరణం, అమరావతి బుద్ధుడి విగ్రహం మనకు అమెరికాకు మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది.
తానా మహాసభలను మా భావాలకు తగ్గట్టుగానే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. మహాసభల్లో హైలైట్స్ అంశాలుగా ఎన్నో చెప్పవచ్చు. అందులో ముఖ్యమైనది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుంచి ప్రత్యేకంగా వచ్చిన పండితుల చేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవంను జరిపించడం. జూలై 6వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈసారి కాన్ఫరెన్స్‌లో శ్రీనివాస కళ్యాణంను మెయిన్ స్టేజిపై జరిపిస్తున్నాము.
తానా మహాసభల వేదికపై అన్నమయ్య సప్తగిరి సంకీర్తన గళార్చన పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. జూలై 6వ తేదీన మహాసభల వేదికపై జరిగే ఈ కార్యక్రమంలో గురు చైతన్య సోదరులతోపాటు 108 మంది కళాకారులు పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను గానం చేయనున్నారు. బిజినెస్ రంగంలో పేరుగాంచిన ఎంతోమంది ప్రముఖుల చేత ప్రసంగాలను ఇప్పిస్తున్నాము. సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేశాము. అన్నీ కార్యక్రమాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చాము.
కాన్ఫరెన్స్ మూడు రోజులు మూడు సంగీత విభావరులను ఏర్పాటు చేశాము. మొదటిరోజున బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి ఉంటుంది. రెండవరోజున గాయని సునీత సంగీత విభావరి ఉంటుంది. చివరిరోజున ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గ్రాండ్ ఫైనల్ విభావరి ఉంటుంది. కురుక్షేత్రం నాటికను మొట్టమొదటిసారిగా తానా వేదికపై ఇంగ్లీష్‌లో ప్రదర్శించనున్నారు.













