బెంగాల్ 15 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీ పోలింగ్
పశ్చిమ బెంగాల్ లో 15 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నడుస్తోంది. ఉదయం 7 గంటలకే ఈ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల కల్లా ముగుస్తుంది. డైమండ్ హార్బర్ లోని 4 పోలింగ్ బూత్ లలో, మగ్రాహాట్ పశ్చిమ్ లోని 11 పోలింగ్ బూత్ లలో ఈ రీపోలింగ్ నడుస్తోంది. ఇవన్నీ కూడా బెంగాల్ లో అత్యంత కీలకమైన దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలోకే వస్తాయి.
నిజానికి బెంగాల్ లో రెండో దశ పోలింగ్ గత నెల 29 న జరిగింది. అయితే.. ఈ సందర్భంగా ఈ పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపించింది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ ప్రాంతంతో పాటు మగ్రాహట్ పశ్చిమ్ లోని పలు బూత్ లలో ఈవీఎం బల్లను టేప్ తో కప్పి వుంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాకుండా పలు పోలింగ్ బూత్ లలో కమలం గుర్తు కనిపించకుండా చేసి, ఓటేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఘటనపై ఈసీ దర్యాప్తు చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.అలాగే మరి కొన్ని పోలింగ్ బూత్ లపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మరో 30 బూత్ లలో కూడా రీ పోలింగ్ నిర్వహించే అవకాశాలు వున్నట్లు అంటున్నారు. అయితే.. వీటిపై మాత్రం ఈసీ ఎలాంటి అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. కానీ రాజకీయ పక్షాల నుంచి, ముఖ్యంగా బీజేపీ నుంచి మాత్రం ఈ వాదన బలంగా వినిపిస్తోంది.








