స్టాలిన్ కోటలో ముంచెత్తిన విజయ్ సునామీ.. సీఎం సహా 28 మంది మంత్రులు వెనుకంజ!
Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రాజకీయ విస్ఫోటనం సంభవించింది. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే పార్టీకి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. తాజా ట్రెండ్స్ ప్రకారం, అధికార పార్టీ అగ్రనేతలందరూ తమ సొంత నియోజకవర్గాల్లో పరాజయం దిశగా సాగుతుండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
వ్యతిరేక ఫలితాలు..
ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో వెనుకంజలో ఉన్నారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఆయనకు వ్యతిరేక ఫలితాలు రావడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
మంత్రులందరూ అదే బాటలో..
కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా, రాష్ట్ర కేబినెట్లోని 28 మంది మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాకంలో వెనుకబడగా, ఇప్పుడు మంత్రులందరూ అదే బాటలో ఉండటంతో డీఎంకే పతనం ఖాయంగా కనిపిస్తోంది.
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా..
రాజకీయ అరంగేట్రం చేసిన తొలిసారే నటుడు విజయ్ (TVK) ప్రభంజనం సృష్టించారు. టీవీకే పార్టీ ఏకంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఏఐడీఎంకే 72 స్థానాలతో రెండో స్థానంలో ఉండగా, అధికార డీఎంకే కేవలం 51 స్థానాలకే పరిమితమై మూడో స్థానానికి పడిపోయింది.
పదేళ్ల తర్వాత తమిళనాడులో అధికార మార్పిడి స్పష్టంగా కనిపిస్తుండగా, హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం డీఎంకే శిబిరంలో నిశ్శబ్దం ఆవహించగా, టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఇవి కూడా చదవండి








