Indians In Gulf: ప్రవాసులను తరలించేందుకు 58 ప్రత్యేక విమానాలు!
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో రోజురోజుకూ తీవ్రమవుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న భయానక పరిస్థితుల మధ్య చిక్కుకుపోయిన భారతీయులను (Indians In Gulf) సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారీ ఎవాక్యుయేషన్ (తరలింపు) ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆయా దేశాల నుంచి ఏకంగా 58 ప్రత్యేక రెస్క్యూ విమానాలను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
రంగంలోకి దేశీయ ఎయిర్‌లైన్స్..
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశీయ విమానయాన సంస్థలు తమ రెగ్యులర్ షెడ్యూల్స్‌ను సవరించుకున్నాయి. ప్రవాసుల (Indians In Gulf) తరలింపు కోసం ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, అవసరమైన చోట విమానాల్లో అదనపు సీటింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను ఆటంకాల్లేకుండా పూర్తి చేసేందుకు విదేశాల్లోని భారతీయ మిషన్లు (ఎంబసీలు), విదేశీ విమానయాన అధికారులతో కేంద్రం నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
![]()
టికెట్ ధరలపై నిఘా.. 1600పైగా విమానాల రద్దు..
ఈ విపత్కర పరిస్థితులను ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు ప్రయాణికుల (Indians In Gulf) నుంచి ఇష్టారీతిన అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఉండేందుకు.. టికెట్ ధరలను పౌర విమానయాన శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మరోవైపు దాడుల భయంతో పలు గల్ఫ్ దేశాలు ముందస్తు భద్రతా చర్యగా తమ గగనతలాన్ని (Airspace) పూర్తిగా మూసివేశాయి. దీనివల్ల సాధారణ కమర్షియల్ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. గగనతలాల మూసివేత కారణంగా ఇప్పటివరకు భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 1,221 విమానాలు, అలాగే విదేశీ సంస్థలకు చెందిన 388 విమానాలు రద్దయినట్లు మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. పౌరుల భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా ఈ తరలింపు ప్రక్రియను వేగవంతం చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి








