అనుమానిత వస్తువులపై… అమెరికాలో కొనసాగుతున్న గర్జన
గగనతలంలో గుర్తుతెలియని వస్తువులపై అమెరికాలో గర్జన కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మరో వస్తువును అగ్రరాజ్య వాయుసేన కూల్చివేసింది. దానికి ముందురోజే కెనడా గగనతలంలో ఇలాంటి ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం మీద పది రోజుల వ్యవధిలో నాలుగు కూల్చివేతలు జరిగాయి. తాజా ఘటన మిషిగన్ రాష్ట్రంలోని హురాన్ సరస్సు వద్ద జరిగింది. సంబంధిత వస్తువు నేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆది అష్టభుజి ఆకృతిలో ఉందని, దానికి దిగువన తాళ్లు వేలాడుతున్నట్లు వారు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు నింగిలోకి వెళ్లిన ఒక ఎఫ్`16 యుద్ధ విమానం, ఏఐఎం9 ఎక్స్ క్షిపణిని ప్రయోగించి ఆ వస్తువును పేల్చివేసినట్లు తెలిపింది.













