PM Modi: మలేషియాతో భారత్ 11 ఒప్పందాలు చేసుకున్న మోడీ
ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తేల్చిచెప్పారు. మలేషియా పర్యటనలో ఉన్న ఆయన, ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కౌలాలంపూర్‌లో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో ‘ద్వంద్వ ప్రమాణాలు’ (Double Standards) ఉండకూడదని, ఇరు దేశాలు రక్షణ, భద్రతా రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ పర్యటనలో భారత్, మలేషియా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేలా మొత్తం 11 కీలక ఒప్పందాలు (MoUs) కుదిరాయి. ఈ పత్రాలను ప్రధాని మోడీ (PM Modi), పీఎం అన్వర్ ఆధ్వర్యంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు మార్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ యుగంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సెమీకండక్టర్ల (Semiconductors) రంగంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే భారత డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘ఎన్పీసీఐ’ (NPCI), మలేషియాకు చెందిన ‘పేయ్నెట్’ (PayNet) మధ్య ఒప్పందం జరిగింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య డిజిటల్ లావాదేవీలు సులభతరం కానున్నాయి. వీటితో పాటు ఆరోగ్యం, ఆయుర్వేదం, విపత్తు నిర్వహణ, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లోనూ ఒప్పందాలు జరిగాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల తర్వాత, అందులో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మలేషియా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం కోసం డాలర్లకు బదులుగా స్థానిక కరెన్సీలైన భారత రూపాయి – మలేషియా రింగిట్ వినియోగాన్ని పెంచడంపై ఇరువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. మలేషియాలో త్వరలో కొత్త భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం ఆయన మలేషియాలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమై, భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.













