మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక సూచన
ఉద్యోగులందరూ మరో ఉద్యోగంపై దృష్టి సారించడం బదులు వారి ప్రస్తుత ఉద్యోగాల్లో మెరుగైన సామర్థ్యం కనబరచాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సూచించారు. ఉద్యోగులు తమ సత్తా చాటేందుకు తదుపరి ఉద్యోగాల కోసం వేచిచూడకుండా ప్రస్తుత ఉద్యోగంలోనే మెరుగైన పనితనం కనబరచాలని అన్నారు. 1992లో తాను తొలిసారి ఆఫీస్లో అడుగుపెట్టిన సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగం తనకు ఉందని, ఇంతకుమించి తనకేదీ అవసరం లేదని అనుకున్నానని వెల్లడించారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యేవరకూ సత్య నాదెళ్ల కంపెనీలోని వివిధ విభాగాల్లో పలు హోదాల్లో పని చేశారు. కంపెనీ సీఈవోగా నియమితులైనప్పటి నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ పనిచేసే విధానాన్ని సమూలంగా మార్చివేశారు.








