ఎరుపెక్కిన ఫారో ఐలండ్.. ఒక్కరోజులో 700కుపైగా డాల్ఫిన్ల ఊచకోత..!
సంస్కృతి, సంప్రదాయాలు .. మానవ సమాజానికి ఉన్నత విలువలు నేర్పేందుకు ఏర్పరచినవి. అవి ఏర్పరచిన వారి మేధో సంపత్తిని బట్టి .. ఆ ఆచారాలకుప్రపంచవ్యాప్త విలువ ఉంటుంది. అయితే..
కొన్ని రకాల జీవన శైలులు ఒళ్లు గగ్గురు పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి ప్రాంతం ఫారో ఐలాండ్స్ అచారం ఒకటి. ఇక్కడ వెయ్యేళ్లుగా కొనసాగుతున్న ఒక ప్రాచీన ఆచారం ప్రపంచవ్యాప్తంగా ఐలండ్ తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. సంప్రదాయం పేరుతో ఇటీవలి ఒక రోజులోనే 700కి పైగా పైలట్ వేల్స్ , వైట్–సైడెడ్ డాల్ఫిన్లను చంపేశారు.
వెయ్యేళ్ల సంప్రదాయం..
ఫారో ఐలాండ్స్‌లో ‘గ్రైండడ్రాప్’ అనే సంప్రదాయం చాలా కాలం నుంచి ఉంది. దీని కింద పెద్ద సంఖ్యలో తిమింగలాలు, డాల్ఫిన్లను బోట్లతో తీరానికి తీసుకువస్తారు. తర్వాత వాటిని చంపి మాంసం, నూనెను స్థానికుల ఆహారం కోసం పంచుతారు. స్థానికులు దీనిని తమ సంస్కృతి, ఆహార అవసరాలు, సామూహిక జీవన విధానంలో భాగంగా చూస్తారు. వారి ప్రకారం ఇది స్థిరమైన, అవసరమైన సంప్రదాయం. ఈసారి జరిగిన ఘటన… మే చివరి వారంలో ఫారో ఐలాండ్స్‌లో మూడు వేర్వేరు ప్లేసుల్లో జరిగింది. ఒక్క రోజులోనే సుమారు 700కి పైగా తిమింగలాలు డాల్ఫిన్లు చంపబడ్డాయి. తీరం రక్తవర్ణంలోకి మారిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా షాక్‌ను కలిగించాయి.
జంతు ప్రేమికుల ఆగ్రహం..
ఈ ఘటనను జంతు హక్కుల సంఘాలు, పర్యావరణవాదులు తీవ్రంగా స్పందించారు. అనవసరమైన, క్రూరమైన హత్యాకాండగా అభివర్ణిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ‘‘ఇది సంప్రదాయం కాదు, క్రూరత్వం’’ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఆచారం పట్ల అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.
సంప్రదాయం మాటున అనైతికత
ఫారో ఐలాండ్స్ ప్రజలు ఈ సంప్రదాయాన్ని తమ సంస్కృతి, ఆత్మగౌరవంతో ముడిపెట్టి చూస్తున్నారు. ఇది వారి ఆహార భద్రతకు కూడా సంబంధించిన విషయం. అయితే ఆధునిక కాలంలో జంతు సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవుల పట్ల దయ వంటి విలువలు బలంగా మారాయి. తిమింగలాలు, డాల్ఫిన్లు అత్యంత తెలివైన సముద్ర జీవులు. వాటిని ఇలా సామూహికంగా చంపడం మానవతా దృక్పథంతో సరిపోదని ప్రపంచవ్యాప్త భావన ఏర్పడుతోంది.








