58కి చేరిన కొత్త రకం కరోనా కేసులు

దేశంలో కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం నాటికి ఆ కేసులు సంఖ్య 58కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కరోజే 20 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలడంతో కేసుల సంఖ్య 38 నుంచి 58కి చేరింది. బాధితులంతా ఆయా రాష్ట్రాల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఇప్పటివరకు యూకే నుంచి తిరిగి వచ్చిన వారిలో లేక వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌లో మాత్రమే కొత్త రకం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల యూకేలో కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూసినప్పటి నుంచి భారత్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆ దేశం నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. అక్కడి నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తోంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి పరీక్షలు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ సృష్టం చేసింది.