యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు 3 పురస్కారాలు
అంతర్జాతీయ హిందీ సాహిత్య సమ్మేళన్ సదస్సుకు అధ్యక్షత వహించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను మూడు పురస్కారాలతో సత్కరించారు. కెనడా రాజధాని టొరంటోలో జరిగిన సమ్మేళన్ వేదికపై విశ్వ హిందీ పత్రకార్ సమితి ‘గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంతర్రాష్ట్రీయ హిందీ సమ్మాన్’, పండిత్ తిలక్ రాజ్ శర్మ మెమోరియల్ ట్రస్టు ‘సాహిత్య స జన శిఖర సమ్మాన్’, గ్లోబల్ హిందీ సాహిత్య శోథ్ సంస్థాన్ ‘ప్రవాసీ భారత రత్న సమ్మాన్’లతో ఆయన్ని సన్మానించాయి. భారత విదేశాంగశాఖ, కల్చరల్ ఆర్గనైజేషన్-కెనడా, గ్లోబల్ హిందీ శోథ్ సంస్థాన్-భారత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది.
భారత కాన్సులేట్ జనరల్ దినేశ్ భాటియా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 20 దేశాల నుంచి కవులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు పాల్గొన్నారు. సదస్సులో యార్లగడ్డ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికార భాషల్లో ఒకటిగా చేర్చేందుకు ప్రవాస భారతీయులందూ విశేష క షి చేయాలని పిలుపునిచ్చారు. ప్రవాసులు తాము నివసించే దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రతిపాదనకు మద్దతు పలకాలన్నారు. గతంలో విదేశాంగమంత్రి హోదాలో అటల్ బిహారీ వాజ్‌పేయి ఐరాసలో తొలిసారి హిందీలో ప్రసంగించారని, అదే బాటలో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో మాట్లాడి భాషా ప్రేమను చాటుకున్నారని గుర్తుచేశారు. హిందీని తొలుత భారతీయ జాతీయ భాషగా చేయాలంటే దేశంలో వివిధ ప్రాంతీయ భాషల్లోని సమాన అర్థాలనిచ్చే పదాలతో సుసంపన్నం చేయాలన్నారు. దీని కోసం హిందీ మాత భాషగా ఉన్నవారు ఇతర భారతీయ భాషలన్నింటీని గౌరవిస్తూ, ఏదో ఒక ముఖ్యంగా దక్షిణాది భాషను నేర్చుకోవాలని సూచించారు.













