అమెరికా నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి… సేవలకు ప్రతిరూపంగా నిలిచిన ఝాన్సీరెడ్డి
అమెరికాలోని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) ఫౌండర్, ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు ప్రస్తుత అడ్వయిజరీ చైర్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల అంటే తెలియనివారు ఉండరు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రవేశించి రaాన్సీరెడ్డి సంచలనం సృష్టించి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. అమెరికా నుంచి పాలకుర్తిదాకా ఆమె చేసిన సేవలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. సొంత రాష్ట్రంలోని ప్రజలకు మరింతగా సేవ చేయాలన్న తలంపుతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అమెరికా పౌరసత్వాన్ని సైతం వీడి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కానీ అమెరికా పౌరసత్వం ఉన్న తను తిరిగి భారత పౌరసత్వం పొందే ప్రాసెస్ లేట్ అవడంతో తన స్థానంలో తన 26 ఏళ్ళ కోడలు యశస్విని రెడ్డి మామిడాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపి గెలిపించుకున్నారు. రాజకీయాల్లో కూడా ఈ గెలుపుతో తన సత్తాను చాటారు. ఆమె ఓడించింది ఎవరోకాదు… 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పాతుకుపోయిన భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు కోటని 47 వేలకి పైగా మెజారిటీతో బద్దలు కొట్టారు. ఈ గెలుపుతో రaాన్సీ పేరు రాజకీయాల్లో కూడా పాపులర్ అయింది.
ఖమ్మం జిల్లా మధిర దగ్గర బనిగళ్లపాడు జన్మించిన రaాన్సీ చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడంతో పెద్దనాన్నతో పాటు అమెరికా వెళ్లిపోయాను. అక్కడే టెన్త్ పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చాను. పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి అయింది. సాధారణంగా భర్త వెంట భార్య అమెరికా వెళ్లడం చూస్తుంటాం. కానీ, ఝాన్సీ విషయంలో ఇది రివర్స్ అయ్యింది. ఝాన్సీ భర్త కార్డియాలజిస్ట్ కావడంతో ఆయన కూడా అమెరికాలో వెళ్ళి వైద్య వృత్తి చేపట్టారు. పై చదువులు చదవాలన్న ఆసక్తితో ఝాన్సీ ప్లస్ టూ తరువాత బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించారు. తరువాత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ఆమె ప్రవేశించారు. కానీ, ఈ రంగంలో మహిళలు పెద్దగా కనిపించనప్పటికీ ఝాన్సీ ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించారు. రియల్ ఎస్టేట్‌లో ఉన్న పురుషాధిక్యతకు చెక్ పెట్టేటట్లుగా ఆమె పాతికేళ్ల క్రితం ‘రాజ్ ప్రాపర్టీస్’ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు. తొలుత ఎందుకొచ్చిన రిస్క్ అన్నవారూ ఉన్నారు. విమర్శలనే కాంప్లిమెంట్‌గా తీసుకుని కొద్దికాలంలోనే ఈ రంగంలో మంచి పేరు సాధించారు.
దేశం మారుతున్నా మగవారి మనస్తత్వాలు, భావాలు మారడం లేదు. అమెరికాలో ఉంటున్న ఎన్నో తెలుగు కుటుంబాల్లో గృహహింస, గొడవలు, రకరకాల చికాకులతో మహిళలు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించిన ఆమె ఇలాంటివారిని ఆదుకోవడం కోసం ఒక సంస్థ ఉండాలనుకున్నారు. అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల కోసం ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ తెలుగు అసోసియేషన్ (వేటా) సంస్థను ఏర్పాటు చేశారు. నిష్ణాతులైన మహిళలను సభ్యులుగా చేర్చుకుని దానిని నేడు మరింతమందికి చేరువచేశారు. ఈ సంస్థ ద్వారా తెలుగు మహిళలకు కావల్సిన ప్రేరణ, ప్రోత్సాహం, ఆసక్తి గల మహిళలందరికీ అందిస్తూ వేటా నేడు అమెరికాలో పేరు ఉన్న సంస్థలలో ఒకటిగా నిలిచింది. వేటా ఏర్పాటు చేయకముందు వివిధ సంఘాల్లో ఆమె కీలకంగా వ్యవహరించి సేవా కార్యక్రమాలను ఉధృతంగా చేశారు. అమెరికా కమ్యూనిటీలో మంచి గుర్తింపును అందుకున్నారు. ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లోకి ప్రవేశించి తెలంగాణ కమ్యూనిటికీ దగ్గరయ్యారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. అమెరికాలో స్థిరపడ్డ రాజేందర్ రెడ్డి కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తుండగా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా, రాజ్ ప్రాపర్టీ సీఈఓగా, హనుమాండ్ల రాజేందర్ రెడ్డి-ఝాన్సీ రెడ్డి ఫౌండేషన్‌కి సహ వ్యవస్థాపకురాలుగా ఉంటూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. 30 ఏళ్ళుగా స్వగ్రామంతోపాటు పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. స్వగ్రామం చెర్లపాలెంలో స్కూల్ భవనం నిర్మించారు. గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతోపాటు స్వంత భూమిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకోసం ప్రభుత్వానికి ఇచ్చారు. తొర్రూరులో పాతికేళ్ళ క్రితమే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. యువత కోసం తొర్రూరు మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పాలకుర్తిలో ఎన్నో కార్యక్రమాలకు ఆమె హాజరవుతూ తనకు చేతనైంతవరకు వారిని ఆదుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు, దేవాలయాలకు విరాళాలను ఇస్తున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను అటు అమెరికాలనూ, ఇటు స్వరాష్ట్రంలోను చేసి మంచిపేరును సంపాదించుకున్నారు.







