అమెరికాలో మంచు తుఫాను
అమెరికాను మంచు తుఫాను, ఈదురు గాలులతో కూడిన చలి వణికిస్తోంది. మంచు తుఫాను కారణంగా ఆగ్నేయ టెక్సస్ నుంచి పశ్చిమ మాసాచుసెట్స్ మార్గంలో రోడ్లపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మిసిసిపీ, ఉత్తర కరోలినాలో రోడ్లపై 4-8 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అనేక ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జాక్సన్, మిస్ ప్రాంతాల్లో గత 21 ఏళ్లలో తొలిసారి సాధారణం కన్నా 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హూస్టన్‌లో సాధారణం కన్నా 20 డిగ్రీలు, డలాస్‌లో 15 డిగ్రీలు, బర్మింగ్‌హామ్‌లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పొగ మంచు వల్ల అమెరికా ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ ఉమ్మడిగా 1200 విమానాలను రద్దు చేశాయి. 650 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కాగా మంచు ప్రభావం న్యూయార్క్నూ తాకొచ్చని వాతావరణ నిపుణులు అంటున్నారు.













