ఇరు దేశాల భేటీకి చకచకా ఏర్పాట్లు
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య వచ్చే నెల 12న సింగపూర్లో జరగాల్సిన శిఖరాగ్ర సదస్సుపై కమ్ముకున్న నీలిమేఘాలు దూదిపింజల్లా తొలగిపోతున్నాయి. సదస్పు ఏర్పాట్ల కోసం అమెరికా ప్రతినిధి బృందం ప్యాంగ్యాంగ్ చేరుకుంది. నాలుగురోజుల క్రితం సింగపూర్ సదస్సును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన ట్రంప్ 24 గంటల్లోనే వెనక్కి తగ్గారు. ఇరు దేశాల మధ్య భేటీకి అవకాశం ఉందని ప్రకటించిన తర్వాత ఉభయ కొరియాలు చర్చలు జరపడం, ఆ తర్వాత అమెరికా బృందం ప్యాంగ్యాంగ్ చేరుకోవడం చకచకా జరిగిపోయాయి. సదస్సు ఏర్పాట్ల కోసం తమ బృందం ఉత్తరకొరియా చేరుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్యాంగ్యాంగ్కు ఎంతో సామర్థ్యం ఉందని, ఏదో ఒకనాడు ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.













