కరోనా మరణాలను తగ్గించి చూపుతున్న అమెరికా
కరోనా వైరస్ ప్రభావంతో పెరుగుతున్న మరణాలను అమెరికా ప్రభుత్వం తగ్గించి చూపుతోందని ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు అంతర్గతంగా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిన తరువాత సంభవించిన మరణాలను మాత్రమే కరోనా మరణాలుగా పరిగణిస్తానమి అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి) వర్గాలను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్టు పత్రిక తన వార్త కథనాలలో వెల్లడించింది. ప్రస్తుతం తాము చెబుతున్న లెక్కలు, వాస్తవానికన్నా తక్కువేనన్న విషయం తమకు తెలుసని సిడిసి ప్రతినిధి క్రిస్టెన్ నార్డ్లాండ్ చెప్పారు. ఇందుకు అనేక కారణాలున్నాయని, కరోనా మరణాలుగా పరిగణించేందుకు వైద్యపరీక్షల్లో నిర్ధారణకు కనీస ప్రమాణంగా నిర్ణయించటంతో పాటు, కొన్ని ప్రాంతాలలో వైద్యపరీక్షలు నిర్వహించటం కష్టసాధ్యమవుతోందని ఆమె వివరించారు.













