డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో …
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ప్యాకేజీపై చేసిన ప్రకటన మారెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎన్నికల ముందు ఆర్థిక ప్యాకేజీ లేదని ప్రకటించడంతో స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ స్టాక్స్ ఎక్కువగా దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ ప్రభావం నుంచి వ్యాపారస్తులు, ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రకటించాలనుకున్న ఉద్దీపన పథకంపై డెమోక్రాట్లతో చర్చలు నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించారు. స్పీకర్ నాన్సీ పెలోసీకి తమ ఆర్థిక ప్యాకేజీపై ఏమాత్రం విశ్వాసం లేదన్నారు.
గెలిచిన తర్వాత అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా భారీ ఉద్దీపన బిల్లును ప్రవేశపెడతాయని ట్రంప్ వెల్లడించారు. ప్యాకేజీపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అమెరికా స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ప్యాకేజీ ఇప్పుడు లేదని తేలడంతో డౌజోన్స్ 378 పాయింట్లకుపైగా నష్టపోయింది. నాస్దాక్ 177 పాయింట్ల, ఎస్ అండ్ పి 47 పాయింట్ల చొప్పున క్షీణించింది. డౌజోన్స్ ఓ సమయంలో 600 పాయింట్లు పడిపోయింది. అంతకుముందు రోజు ట్రంప్ కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి వైట్‌హౌస్‌కు రావడంతో ప్యాకేజీ ప్రకటనపై ఆశలతో మార్కెట్లు లాభపడ్డాయి. కరోనా కారణంగా విమానాయానం, అతిథ్య రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. మంగళవారం వరకు ప్యాకేజీలపై ఆశలు పెట్టుకున్న ఎయిర్‌లైన్స్ స్టాక్స్ ట్రంప్ ప్రకటన తర్వాత భారీగా దెబ్బతిన్నాయి. అలాగే టెక్ దిగ్గజాలు కూడా కుప్పకూలాయి. బోయింగ్, టెస్లా, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డీలాపడ్డాయి. ఫార్మా దిగ్గజాలు కూడా పడిపోయాయి.













