దీపావళిని అధికారిక సెలవుగా ప్రకటించిన పెన్సిల్వేనియా
అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ దీపావళిని సెలవు దినంగా ప్రకటించింది. ఈ బిల్లును స్టేట్ సెనేట్, హౌస్ రెండూ ఆమోదించాయి. సెనేట్‌లో పాసైన బిల్-402లో దీపావళి రోజున స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులు మూసేయాలని చెప్పడం లేదు. హౌస్‌లో ఆమోదం పొందిన 436 బిల్ మాత్రం హిందూ సంప్రదాయంలో కార్తిక మాసంలో 15వ రోజైన దీపావళిని.. పెన్సిల్వేనియాలో దివాలీ డేగా గుర్తించింది. సెనేటర్ గ్రెగ్ రాథ్మన్తోపాటు భారతీయ మూలాలున్న స్టేట్ సెనేటర్ నికిల్ సవాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత మాట్లాడిన నికిల్.. ‘దివాళీకి ఈ గుర్తింపు లభించడం.. ఈ పండుగను జరుపుకునే వేలాది మందిని కూడా తాము కలుపుకొని వెళ్తున్నామనే స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది’ అని చెప్పారు.
‘సెనేట్‌లోని మిగతా సభ్యులు, పెన్సిల్వేనియాలోని 2 లక్షల మంది దక్షిణాసియా ప్రజల తరఫున ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో సహకరించిన సెనేటర్ రాథ్మన్కు ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో చీకటిపై వెలుగు సాధించే విజయాన్ని స్టేట్ మొత్తానికి విస్తరించినట్లే’ అని చెప్పారు. ‘ప్రతి ఏడాది వేలాది మంది పెన్సిల్వేనియా ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఇలాంటి పండుగను సెలవుగా గుర్తించడం మన భిన్నత్వ సంప్రదాయాన్ని నిలబెడుతుంది’ అని రాథ్‌మన్ అన్నారు.













