అమెరికాలో పంది గుండె అమర్చిన మరో వ్యక్తి.. 40 రోజుల తర్వాత
అమెరికాలో పంది గుండె అమర్చిన మరో వ్యక్తి కన్నుమూశాడు. లారెన్స్ ఫౌసెట్(58)కు సెప్టెంబరు 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు. 40 రోజుల తర్వాత ఆ గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతి చెందినట్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసన్ వెల్లడిరచింది. తొలుత నెల రోజులపాటు అది మెరుగ్గానే పనిచేసిందని, ఆ తరువాత నుంచి క్షీణించడం మొదలైందని పేర్కొంది. లారెన్స్ ఫౌసెట్ శస్త్రచికిత్స పూర్తయిన తరువాత అతడి ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు కనిపించింది. ఫిజియో థెరపీలో పాల్గొన్నాడు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ భార్యతో కలిసి కార్డ్స్ కూడా ఆడేవాడు. ఇటీవలి రోజుల్లో అతడి గుండె వైఫల్య సంకేతాలను చూపించింది. ఆయనకు చేసింది మానవ అవయవాల మార్పిడిలో ఓ సవాలుతో కూడుకున్న శస్త్ర చికిత్స. అందుకోసం వైద్య బృందం తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ లారెన్స్ అక్టోబరు 30న తుది శ్వాస విడిచాడని ఆయనకు చికిత్స అందజేసి ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.













