భారత్ సహా మిత్ర దేశాలతో చర్చలు : అమెరికా
అంతర్జాతీయంగా సరఫరా చెయిన్ పునర్వ్యువస్థీకరణకు భారత్ సహా మిత్ర దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోందని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో మందుల సరఫరాల కోసం భారత్ ఎగుమతులపై పాంపియో మాట్లాడుతూ, ఆస్ట్రేలియా, భారత్, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియాత్నాంలతో చర్చలు జరుపుతున్నామని, పరస్పరం సమాచారం పంచుకుని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అందులో గ్లోబల్ సప్లై చెయిన్స్ (అంతర్జాతీయంగా సరఫరాలు)పై కచ్చితంగా చర్చిస్తామని తెలిపారు. ఈ సరఫరాలను పునరుద్ధరించి, ఇటువంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా ఉండేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల హైడ్రాక్వి క్లోరోక్విన్ సరఫరాపై భారత్‌లో అనుభవాన్ని పంచుకున్నారు. గత నాలుగు వారాల్లో నాలుగు సార్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాంపియో ఫోన్లో మాట్లాడారు.













