రెస్టారెంటులో ఆశ పెట్టి జారుకొన్న ట్రంప్
పలు కేసుల్లో కోర్టు విచారణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ వ్యవహారంలో తీవ్ర విమర్శలపాలు అవుతున్నారు. అధికారిక రహస్యాల దస్త్రాలను తన ఇంట్లో దాచారన్న కేసులో అభియోగాలున్న ట్రంప్ గత వారం మియామీలోని ఫెడరల్ కోర్టుకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో స్థానిక క్యూబన్ రెస్టారెంటును సందర్శించారు. మాజీ అధ్యక్షుడు రావడంతో అక్కడున్నవారు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆయనతో చేతులు కలుపుతూ పాటలతో ముందుస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ క్రమంలో మీకందరికీ ఆహారం ఉచితం అంటూ ట్రంప్ గట్టిగా అరిచి మరీ ప్రకటించారు. దీంతో తాము తిన్నదానికి ట్రంప్ బిల్లు చెల్లిస్తారని అక్కడివారంతా మరింత సంబరపడ్డారు. కొద్దిసేపు అక్కడే గడిపిన ట్రంప్ చివరకు ఏ బిల్లూ కట్టకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికాదాకా హుషారుగా ఉన్న అందరూ ఈ విషయం తెలిసి విస్తుపోయారు.













