విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండేళ్ల పాలనలో చరిత్రాత్మక విజయాలు సాధించారని శ్వేతసౌధం తెలిపింది. 2017 జనవరి 20వ తేదీన ట్రంప్ బాధ్యతలు చేపట్టగా, అప్పటి నుంచి రాజకీయంగా ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. అయితే ఆయన హయాంలో ఆర్థిక రంగం పురోగమిస్తోందని, రెండేళ్లలో కొత్తగా 50 లక్షల ఉద్యోగాలను సృష్టించారని, వాణిజ్యంలో అక్రమ విధానాలను అవలంబిస్తున్న చైనాను కట్టడి చేశారని అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తి 3.4 శాతం మేర పెరిగిందని, అమెరికా పరిశ్రమలు, కార్మికులకు మేలు చేసేలా వివిధ దేశాలతో కొత్తగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారని వివరించింది. అమెరికాకు నష్టం చేసే ఎలాంటి ఒప్పందాన్నీ ఆయన అంగీకరించడం లేదని తెలిపింది. గతంలో కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి వచ్చాయని వివరించింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఎస్ను ఓడించారని, అందుకే సిరియాలోని అమెరికా దళాలను వెనక్కి పిలిపిస్తున్నారని పేర్కొంది.













