జీ-7 కు రండి.. మోదీకి ట్రంప్ ఆహ్వానం
అమెరికాలో జరిగే జీ -7 సదస్సుకు హాజరు కావాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీ, ట్రంప్ ఫోన్లో సంభాషించుకున్నారు. ఇంతకుముందు జీ-7 కూటమిని విస్తరించాలని, భారత్ తదితర దేశాలకు సభ్యత్వం కల్పించాలని ట్రంప్ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఇరువురు నేతలు మధ్య చర్చకు వచ్చిందని ఓ అధికార ప్రకటనలో తెలిపారు. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంపై కూడా వారిరువురు చర్చించుకున్నట్లు పేర్కొన్నారు. ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కనుగొనాలని ట్రంప్‌కు సూచించారు. ట్రంప్‌తో వివిధ అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయని మోదీ ట్వీట్ చేశారు. కరోనా అనంతర పరిస్థితులకు అనుగుణంగా జీ-7 గ్రూప్‌ను విస్తరించాలని ప్రయత్నించడం ట్రంప్ ముందుచూపునకు నిదర్శనమని పేర్కొన్నారు.













