రష్యాతో జూనియర్ ట్రంప్ సమావేశం నిజమే : ట్రంప్
రష్యన్లతో తన కుమారుడు జూనియర్ ట్రంప్ సమావేశం నిజమేనని అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఎన్నికల్లో ప్రత్యర్థికి సంబంధించిన లోపాలను తెలుసుకునేందుకే రష్యన్ న్యాయవాది నటాలియా వెజిల్నిట్క్సాయాతో జూనియర్ ట్రంప్ సమావేశమైనట్లు తెలిపారు. అయితే ఆ భేటీ చట్ట వ్యతిరేకమైన చర్యేమే కాదని, ప్రత్యర్థికి సంబంధించిన లోపాలను తెలుసుకోవడం సహజమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యన్ల పాత్రపై విచారణలో ఈ సమావేశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఈ భేటీపై స్పందించిన జూనియర్ ట్రంప్ రష్యా పిల్లలను అమెరికన్లు దత్తత తీసుకోవడం గురించి తమ మధ్య చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల్లో తమ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ గురించి తెలుసుకోవడానికి నటాలియాతో భేటీ అయ్యానని అంగీకరించారు. అయితే నటాలియా నుంచి తమకు కావాల్సిన సమాచారం మాత్రం అందలేదని జూనియర్ ట్రంప్ తెలిపారు.













