H1B Visa: హెచ్1బీ వీసాలపై యూఎస్ ఫోకస్.. అమెరికన్లకు అన్యాయం జరిగితే ఊరుకోం!

అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం (Trump Administration) హెచ్-1బీ వీసా (H1B Visa) ప్రోగ్రామ్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ వీసా ప్రక్రియల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అమెరికన్లకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను విదేశీయులకు ఇస్తున్నాయని కొన్ని కంపెనీలపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కొన్ని కంపెనీలపై దర్యాప్తు ప్రారంభించామని అమెరికా న్యాయ శాఖ (డీవోజే) హెచ్చరించింది. డీవోజేలో (DoJ) అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన హర్మీత్ థిల్లాన్ ఈ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్నారు. అమెరికన్లకు అన్యాయం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమ హాట్‌లైన్‌కు సమాచారం అందించాలని ఆమె కోరారు.
ఇటీవలే అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ కూడా హెచ్-1బీ వీసా (H1B Visa) విధానంపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాన్ని “పెద్ద స్కామ్”గా అభివర్ణించారు. దీన్ని మార్చేందుకు తాను పనిచేస్తున్నానని కూడా చెప్పారు.. ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, అర్హతలకు ప్రాధాన్యత ఇచ్చే “వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్”ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
అయితే అమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే 85,000 హెచ్-1బీ వీసాల్లో (H1B Visa) అధిక శాతం భారతీయులే పొందుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలు మారిస్తే.. భారతీయ టెకీలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, అంతర్జాతీయ విద్యార్థుల వీసాలపై కూడా ట్రంప్ ప్రభుత్వం (Trump Administration) కొత్త నియమాలు ప్రకటించింది. విద్యార్థి వీసాల గడువును గరిష్ఠంగా నాలుగేళ్లకు పరిమితం చేయాలని చూస్తోంది. అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులలో (International Students) భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నిర్ణయం కూడా భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది.