ఇది చరిత్ర సృష్టించిన విషయం : మహేశ్ బిగాల
దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా పార్టీ సభ్యులు ఉన్నారని, ఇది ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన విషయమని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఎంపీ కవితతో సమావేశమయ్యారు. ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్‌గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయాదేశాల్లో పార్టీ కార్యక్రమాలు, సభ్యత్వంపై ఎంపీ కవితకు వివరించారు. పార్టీ ఎన్నారై విభాగం ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే ప్రపంచంలోని అన్ని ఖండాల్లోని ఇరవై దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు స్థాపించామని పేర్కొన్నారు. ఈవిధంగా ఎన్నారై శాఖలు దేశంలో ఏ పార్టీకి లేవని, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సాధ్యమైందని అన్నారు. ఈ నెల 27న నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీకి ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఎన్నారై సంక్షేమ నిధుల్లో అత్యధికంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విన్నవించామని, దీనిపై విధివిధానాలు తయారుచేసేందుకు సాయం చేయాలని ఎంపీ కవితను కోరారు.













