తెలంగాణ విద్యార్థిపై అమెరికాలో దారుణం
అమెరికా గడ్డపై అడుగుపెట్టినా తెలంగాణ వాసి గుర్తు తెలియని దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూస సాయికృష్ణ ఆగంతకుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో జనవరి 3వ తేదీ రాత్రి సాయికృష్ణ మీద దాడి జరిగింది. లారెన్స్ టెక్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసిన సాయికృష్ణ డెట్రాయిట్‌లోని ఆటోమోటివ్ కంపెనీలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నారు. మూడో తేదీ రాత్రి 11:30కి సాయికృష్ణ ఒక్కడే కారులో ఇంటికి వెళ్తూ స్థానిక మెక్సికన్ పుడ్‌కోర్టు దగ్గర ఆగారు. ఆయన కారు దిగకముందే కొందరు దుండగులు అనూహ్యంగా కారులో జొరబడ్డారు. సాయికృష్ణను తుపాకీతో బెదిరించి కారులో కొన్ని మైళ్ల దూరం తీసుకెళ్లారు. ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో కారు ఆపి నిలువుదోపిడి చేశారు.
బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, ఐడీ కార్డులు, క్రెడిట్‌కార్డులు, డెబిట్ కార్డులు లాక్కున్నారు. ప్యాంటు కూడా విప్పించారు. ఆ తర్వాత సాయికీష్ణ నోట్లో తుపాకి పెట్టి కాల్చారు. కుడి భుజం మీదా కాల్పులు జరిపారు. రక్త మోడుతున్న సాయికృష్ణను నడిరోడ్డు మీద వదిలేసి ఆయన కారులోనే పరారయ్యారు. ఎముకలు కొరికే చలిలో గంటకు పైగా నడిరోడ్డుపై గాయాలతో పడి ఉన్న సాయికృష్ణను కొందరు మహిళలు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. సాయికృష్ణకు ఆరోగ్య బీమా లేదు. అతని ఆస్పత్రి ఖర్చలకు ప్రవాస భారతీయుల ఆన్లైన్లో ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.15 లక్ష డాలర్లను పోగు చేశారు. ఆదివారం మొదటి శస్త్రచికిత్సను జరగ్గా, నేడు మరో శస్త్రచికిత్స చేస్తారు. మరికొన్ని సర్జరీలు చేయాల్సి ఉందని చెబుతున్నారు.













