సీటెల్‌లో టిటిఎ బోర్డ్ సమావేశం విజయవంతం
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) బోర్డ్ సమావేశం సెప్టెంబర్ 16వ తేదీ శనివారంనాడు సీటెల్‌లో జరిగింది. పలువురు బోర్డ్ నాయకులు, టిటిఎ ప్రముఖులు, వ్యవస్థాపకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత బోర్డ్ సభ్యులు ఇటీవల సీటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందులకి న్యాయం చేయాలని కోరుతూ, జాహ్నవి మృతికి సంతాపం తెలియజేస్తూ నిముషం పాటు మౌనం పాటించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
బోర్డ్ ప్రారంభ సందేశాన్ని టిటిఎ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి వివరిస్తూ, సీటెల్ లో వచ్చే సంవత్సరం జరగనున్న 2024 మెగా కన్వెన్షన్ గురించి ఎసి, ఇసి, బిఓడి సభ్యులకు తన అభిప్రాయాలను తెలియజేసి, ఈ మెగా కన్వెన్షన్ విజయవంతానికి, అవసరమైన నిధుల సమీకరణకు బోర్డ్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
అడ్వైజరీ చైర్ డా.విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, టిటిఎ 2024 మెగా కన్వెన్షన్ విజయవంతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తెలియజేశారు. నిధుల సేకరణ కార్యక్రమాలపై పని చేయడం ప్రారంభించాలని అన్ని టిటిఎ రాష్ట్ర చాప్టర్లను కోరారు. అడ్వైజరీ కో-చైర్ మోహన్ పాటల్లోల, సభ్యుడు భరత్ మాదాడి 2023 డిసెంబర్ లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సేవా దినోత్సవాలు, అలాగే కన్వెన్షన్ గురించి వివరాలను తెలియజేశారు.
టిటిఎ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మాట్లాడుతూ, తన సొంత నగరం సీటెల్‌లో జరిగిన బోర్డు మీటింగ్‌కు హాజరైనందుకు బోర్డు సభ్యులకు, ఇతర టిటిఎ టీంకు కృతజ్ఞతలు తెలిపారు. టిటిఎ 2024 మెగా కన్వెన్షన్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు మరియు నిధుల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని బోర్డు సభ్యులందరినీ కోరారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెద్ది మాట్లాడుతూ, ఇసీ సభ్యులు ఇప్పటి నుంచే మెగా కన్వెన్షన్ 2024 విజయవంతం కోసం నిధుల సేకరణకోసం కృషి చేయాలని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలతో పనిచేయాలని కోరారు. కొత్త టిటిఎ లోగో మరియు టిటిఎ మెగా కన్వెన్షన్ 2024 లోగోలను లాంచ్ చేయాలని టిటిఎ అడ్వైజరీ కమిటీని సెక్రటరీ కవితా రెడ్డి అభ్యర్థించారు. టీమ్ సభ్యులందరూ మెగా కన్వెన్షన్‌కు తమ సహకారాన్ని అందజేసారు. ఈ సందర్భంగా బోర్డ్ మీటింగ్‌లో దాదాపు 1 మిలియన్ డాలర్లు నిధుల సేకరణకు హామీలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో జరిగే టిటిఎ సేవాడేస్ కార్యక్రమాలకు అవసరమైన ప్రణాళిక, రోడ్ మ్యాప్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ సేవాడేస్ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని కోరారు. బోర్డు సమావేశం తర్వాత, టిటిఎ సభ్యులు సీటెల్ కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించారు. ఆరోజు సాయంత్రం సభ్యులందరూ కల్చరల్ అండ్ కన్వెన్షన్ కిక్-ఆఫ్ పార్టీకి హాజరయ్యారు ఈ సందర్భంగా టిటిఎ సీటెల్ స్థానిక సంఘం సమావేశం కోసం మరో 1 మిలియన్ డాలర్లు సేకరించింది. సభ్యులకోసం స్థానిక బృందం నోరూరించే ఆహార పదార్ధాలను ఏర్పాటు చేసింది. మంచి ఆతిధ్యం ఇచ్చినందుకు స్థానిక టీటిఎ టీమ్‌ను ఎసి, ఇసి, బిఓడి, ఆర్విపి, ఎస్సి సభ్యులు అభినందించారు. సమావేశాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన అందరికీ స్పాన్సర్లకు బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది.













