ఏపీ టీచర్‌కు అమెరికా ఆహ్వానం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జెడ్పీ హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు పచ్చారు హరికృష్ణ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఎక్స్చేంజ్ పోగ్రాం లో భాగంగా రెండు నెలలపాటు అమెరికా పర్యటనకు ఎంపికయ్యారు. అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ బ్యూరో ఆప్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలోని పుల్బ్రెట్త్ పారిన్ స్కాలర్షిప్ బోర్డు వంద దేశాలకు నుంచి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఇందుకు ఎంపిక చేసింది.
మన దేశం నుంచి కేరళ, మహారాష్ట్ర నుంచి ఇద్దరేసి, తెలంగాణ, ఆంధప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఆరుగురు ఎంపికయ్యారు. అమెరికాలోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో నూతన విద్యావిధానాలు, నైపుణ్యాలు బోధనా పద్ధతుల్లోని మార్పులపై వీరు అధ్యయనం చేస్తారు. వీరికి వివిధ దేశాల ఉపాధ్యాయులతో పరస్పర సంభాషణలతో వృత్తిని మెరుగుపరుచుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 2005 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న హరికృష్ణ స్వగ్రామం మంగళగిరి. తన నైపుణ్యాన్ని పెంచుకునేందుకు వివిధ దేశాల ఉపాధ్యాయులతో మొదట సామాజిక మాధ్యమంలో ఒక గ్రూపును ప్రారంభించారు.
విద్యార్థులనూ భాగస్వాములను చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించి ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నారాయణ ప్రోత్సాహంతో ఆచరణలోకి తెచ్చారు. స్కైప్, జూమ్ మాధ్యమాల ద్వారా 65 దేశాల్లోని 220 పాఠశాలల టీచర్లు, విద్యార్థులతో ఇక్కడి విద్యార్థుల్ని మాట్లాడించారు. ఈ అలవాటు విద్యార్థుల్లో ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టింది. విదేశీ విద్యార్థులకు ఉత్తరాలు రాస్తూ కలం స్నేహం చేస్తున్నారు.













