టీడిఎఫ్ కోవిడ్ 19 సమావేశం సక్సెస్… పాల్గొన్న అమెరికా-ఇండియా వైద్య ప్రముఖులు, మంత్రి ఈటెల రాజేందర్
అటు అమెరికాలోను ఇటు భారతదేశం ముఖ్యంగా తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆదివారం, 26, జులై 2020న ఒక సెమినార్‌ను ఆన్లైన్ లో నిర్వహించింది. ఈ సెమినార్‌కి అమెరికాలోని అనేక మంది పెద్దలు దాదాపు 350 మంది హాజరయ్యారు. అమెరికాలోని అతిపెద్ద సంస్థ ఆపి (ఏఏపిఐ) మాజీ అధ్యక్షులు డా।। సురేష్ రెడ్డి, డా। సుష్మ, టీడీఎఫ్ ప్రెసిడెంట్ శ్రీమతి కవిత చల్లా, చైర్మన్ శ్రీరామ్ కాకులవర్గం, మరియు డా సుజిత్ రెడ్డి పున్నం, డా।। భరత్ నరవెల్ల, డా।। దిలీష్ అనిరెడ్డి, డా।। గోపాల్ రెడ్డి గాదే లాంటి ప్రముఖులు అమెరికా వైపు నుంచి హాజరయ్యారు. డా।। వరప్రసాద రెడ్డి (శాంతాబయో టెక్), డా।। ప్రతాప్‌రెడ్డి (అపోలో హాస్పిటల్స్) డా।। గురువా రెడ్డి (సన్‌షైన్ హాస్పిటల్) డా।। గురు రెడ్డి (కాంటినెంటల్ హాస్పిటల్స్) డా।। రమేష్‌రెడ్డి (డైరెక్టర్, మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్) మొదలగు వారు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ సంక్షోభంలో అనుసరిస్తున్న అన్ని విధానాలను వివరించారు. ఇంకా ముందుముందు ఒకేసారి లక్ష కేసులు వచ్చినా ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అమెరికాలోని, హైదరాబాద్‌లోని మేధావులు తమ విజ్ఞానాన్ని ప్రభుత్వానికి సహయపడేలా అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
డా।। వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాలు కరోనాకి వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ని తయారు చేయటంలో 5 రకాలు ఉన్నాయి. అందులో ఏది ముందు వస్తుంది తెలీదు. ఐసీఎంఆర్ లాంటి ఆగస్ట్ 15కి వ్యాక్సిన్ వస్తుంది అని ప్రకటించడం చాలా తప్పు అని అన్నారు. అంతర్జాతీయ సంస్థ పైజర్ తన ఆర్ అండ్ డి కోసం 5.5 బిలియన్ డాలర్లు కేటాయిస్తుంది. కాని భారత ప్రభుత్వం అన్ని రంగాలకు కలిపి కూడా అంత కేటాయించదు అని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో 11 యూనివర్సిటీలు ఉంటే అందులో సగానికి పైగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేరు. అధ్యాపకులు లేరు. రీసెర్చ్ అనేది యూనివర్సిటీలలోనే జరగాలి. కాని అది ఇడియాలో జరగడం లేదని పేర్కొన్నారు.
డా।। గురువారెడ్డి మాట్లాడుతూ కొవిడ్‌ని అత్తగారితో పోలుస్తూ హాస్యపూరితంగా మాట్లాడారు. కొవిడ్‌ని గుర్తించి, జాగ్రత్తగా ఉంటూ దాని జోలికి పోకుండా ఉంటే అది మన జోలికి రాదు. కొన్నాళ్ళు ఉంటుంది. మెల్లగా అదే వెళ్లిపోతుంది అని వివరించారు. ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్వహణ చాలా కష్టంగా ఉన్నదని, ప్రభుత్వం, ప్రజలు, పత్రికలు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వ్యతిరేకంగా ఉంటున్నాయని అన్నారు. మా సన్‌షైన్ హాస్పిటల్లో నెలకు 350 కి పైగా సర్జరీలు చేసేవాడిని…ఇప్పుడు పూర్తి టైమ్ కోవిడ్‌కి కేటాయిస్తున్నాం. అలాగే నర్సింగ్ స్టాఫ్‌ని మోటివేట్ చేస్తూ, వాళ్ళ జీతాలు రెండింతలు, మూడింతలు చేశామని, వారికి ఎప్పటికప్పుడు కొత్త పిపిఇ కిట్స్ ఇస్తూ వారి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పారు.
డా।। ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్స్, ఎన్నారైలు, దాతలు అందరూ ఒక్క వేదిక మీదకు వచ్చి ఒక్కమాటగా నిలవాలని, ఒక్క బాటలో నడవాలని సూచించారు. ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో ఒక పక్క ప్రజలలో టెస్టింగ్, ట్రేసింగ్, సెల్ఫ్ ఐసొలేషన్, సెల్ఫ్ క్వారంటైన్ గురించిన అవగాహన పెంచాలని, రెండోవైపు హాస్పటల్స్‌లో ఆక్సిజన్లు, వెంటిలేటర్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
డా।। గురు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టింగ్ సరిగ్గా చేయకపోయినా, స్టాటిస్టిక్స్ సరిగ్గా ఇవ్వకపోయినా ఈ సంక్షోభం మరింత పెరిగే ప్రమాదముందని అన్నారు. తమ కాంటినెంటల్ హాస్పిటల్స్ లో స్పేస్ ఉండటం వలన కోవిడ్ పేషంట్లను, వార్డ్‌లను దూరంగా ఉంచామని, దీంతో ఇక్కడకు వస్తున్న ప్రజలకు తాముసేఫ్గా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారన్నారు. అయితే ప్రజలలో మూఢ నమ్మకాలు ఉన్నాయని, ఒక్కో కాలని, ఒక్కో అపార్టుమెంట్స్ ఒక్కో విధంగా ఆలోచిస్తున్నాయని రాజకీయ నాయకులు వారికి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.
టీడీఎఫ్ అధ్యక్షులు శ్రీమతి కవిత చల్లా మాట్లాడుతూ 3 రోజుల వ్యవధిలో ఇంతపెద్ద సమావేశం ఏర్పాటుకు సహకరించిన పెద్దలకు, ఇంత సమయం ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు టీ.డీ.ఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.
డా।। సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఆపిలో దాదాపు లక్షకు పైగా భారతీయ డాకర్లు ఉన్నారని అందులో తెలుగువారు ఎక్కువగానే ఉన్నారని, వారందరు కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో సేవ చేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.













