తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ వాషింగ్టన్ డి.సి ఆధ్వర్యం లో అంబరాన్నంటిన బతుకమ్మ, దసరా సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ యూ.ఎస్.ఏ వాషింగ్టన్ డి.సి చాఫ్టర్ ఆధ్వర్యంలో వర్జీనియాలోని అశ్బర్న్ లో బ్రాడ్ రన్ హైస్కూల్ లో బతుకమ్మ, దసరా వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. టి.డి.ఎఫ్ అధ్యక్షులు కవిత చల్ల ఆధ్వర్యంలో వినయ తిరిక్కోవల్లూరు, జీనత్ కుందూరు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన ఈ వేడుకల్లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగకి పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, 12 సంవత్సరాలకు పైబడిన వారికి మాత్రమే అనుమతించారు. మేళ తాళాలతో ఊరేగింపుగా సాగిన బతుకమ్మ పండుగలో దాదాపు 800మందికి పైగా పాల్గొన్నారు. ఆ తర్వాత బతుకమ్మలన్నిటిని ఒకచోట పెట్టి, పాటలు పాడుతూ, పాటకనుగుణంగా స్టెప్పులు వేస్తూ మహిళలు బతుకమ్మ ఆట పాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ తమ బతుకమ్మలను అందంగా అలంకరించగా, చక్కటి బతుకమ్మలకు పోటీలు కూడా నిర్వహించారు. మన సంస్కృతీ సంప్రదాయాలు పాటించి పేర్చిన బతుకమ్మలకు, బహుమతులు కూడా అందచేశారు.
ఈ సందర్బంగా జరిగిన దసరా జమ్మి పూజలో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ప్రెసిడెంట్ కవిత చల్లా, తమ కార్యవర్గ సభ్యులతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చిన చాలా మంది పాల్గొని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అందరూ జమ్మి ని ఇచ్చి పుచ్చుకుని ఆలింగనాలు చేసుకుని, బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు తెలంగాణా సాంప్రదాయంలో రంగు రంగుల వస్త్ర ధారణలో మెరిసిపోతూ, చూడ ముచ్చటగా అలంకరించుకునిరాగా స్కూల్ ఆవరణం అంతా ఒక తెలంగాణా పల్లె వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ సందర్బంగా కల్పనా బోయిన పల్లి నిర్వహణలో ఏర్పాటు చేసిన నగలు, బట్టలు, అలంకరణ సామగ్రి లాంటి స్టాల్స్ లో మహిళలు, పురుషులు సందడిగా కనిపించారు. తెలంగాణా రుచులతో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో అందరూ తెలంగాణ రుచులని ఆస్వాదించారు. మంజువాణి నాట్య బృందం ప్రదర్శించిన నృత్యరూపకం పలువురిని అలరించింది. నృత్యంలో ఒక ప్రత్యేక పాత్ర ద్వారా ఆకట్టుకున్న వికాస్, తన మిమిక్రీ తో కూడా అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. రవల్లిక బానోత్ చేసిన డుక్కు డుక్కు పాటకు నృత్యానికి అందరూ స్టెప్పులు, ఈలలు వేశారు.
అమెరికా చట్ట సభలకు ఎన్నికైన కొందరు అమెరికన్ చట్టసభ ప్రతినిధులు ఈ బతుకమ్మ పండుగలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటా, వేటా, జిడబ్ల్యుటీసిఎస్, క్యాట్స్, ఉజ్వల సంస్థలు సపోర్టింగ్ సంస్థలు గా వ్యవహరించాయి. ఆతర్వాత జరిగిన బతుకమ్మ నిమజ్జనం తర్వాత ఒకరికొకరు సద్దులు, పసుపు, కుంకుమలను ఇచ్చి పుచ్చుకున్నారు.
కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కవిత చల్ల కార్యవర్గ సభ్యులకు జీనత్ కుందురు, రామ్మోహన్ సూరనేని, మల్లారెడ్డి, నవీన్ చల్ల, రవి పళ్ళ, హర్ష రెడ్డి, నరేందర్ మరియు స్పాన్సర్స్కి, వాలంటీర్స్కి, డీసీ వనిత లీడర్షిప్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసారు.
ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, జిడబ్ల్యుటీసిఎస్ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, జిడబ్ల్యుటీసిఎస్ అధ్యక్షులు సుధా పాలడుగు, క్యాట్స్ అధ్యక్షులు సుధా కొండపు, ఉజ్వల అధ్యక్షులు అనిత ముతోజు, వేటా కార్యవర్గ లోకల్ టీం మరియు ఇతర స్థానిక తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా జరుపని ఈ పండుగ గత జ్ఞాపకాలని తలచుకుంటూ, కొత్త ఉత్సాహంతో ఈ బతుకమ్మ సంబరాల్లో అందరూ ఆనందంగా పాల్గొని విజయవంతం చేసిన అందరికీ, ప్రెసిడెంట్ కవిత చల్ల, కో ఆర్డినేటర్ వినయ, మంజు, కల్పన ధన్యవాదాలు తెలిపారు. అందరు క్షేమంగా ఉండాలి అని ప్రార్ధిస్తూ కార్యక్రమాన్ని టిడిఎఫ్ యుఎస్ఎ అధ్యక్షురాలు కవిత చల్ల ముగించారు.













