చి.లలిత్ ఆదిత్య గన్నవరం కు “అవధాన యువరత్న” బిరుదుతో ఘనంగా సత్కారం
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 133 వ సాహిత్య సదస్సును ఆదివారం, ఆగస్ట్ 19న డాలస్ లో శ్రీ వీర్నపు చినసత్యం గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 133 నెలలుగా సాహితీవేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్దసంఖ్యలో తరలివఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు.
కొత్తతరం తెలుగులో మాట్లాడటమే కష్టమవుతున్న ఈ కంప్యూటర్ కంలో అమెరికాలో పుట్టిపెరిగి నూనూగు మీసాల నూత్నయవ్వనం లోనే చి. లలిత్ ఆదిత్య గన్నవరం అవధానిగా ఎదిగి ఇటు ఇంటా అటు బయటా దిగ్విజయంగా అవధాన జైత్రయాత్ర చేయడం అందరినీ అబ్బురపరచే విషయం. 17 ఏళ్ల ఈ చిరుతకి ఇది 6వ అవధానం. అందరిలో ఉత్కంఠను రేపిన ఈ అవధాన కార్యక్రమానికి అమెరికా అవధానిగా పేరెన్నికగన్న డా. పుదూర్ జగదీశ్వరన్ అధ్యక్షత వహించారు.
డొక్కారామ్ సంధాతగా, చిలుకూరి సత్యదేవ్ నిషిధ్ధాక్షరి, డా.గన్నవరపు నరసింహమూర్తి సమస్య, కోట శర్మ న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, డా. కలవగుంట సుధ వర్ణన, డా. దొడ్ల రమణ పురాణ పఠనం, డొక్కా ఫణి అప్రస్తుత ప్రసంగం పృచ్చకులుగా వ్యవహరించగా మన బడి విద్యార్థులు కస్తూరి ప్రణవ్, తాడేపల్లి అభిరామ్ ఆశువు అంశాన్ని కడు సమర్థవంతంగా నిర్వహించడం మరొక విశేషం. యువ అవధాని గురు వందనం తో మొదలెట్టి కార్యక్రమము ఆద్యంతం ఎలాంటి తొట్రుపాటు లేకుండా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ సమస్యలను పూరిస్తూ అందరినీ అలరింపచేసాడు. ‘సంభ్రమమొందగా దగదు చంద్రుడు ఢీకొన సూర్య గోళమున్’ అన్న సమస్యని శివ తాండవ సన్నివేశాన్ని వర్ణిస్తూ పూరించడం, తెలుగు ఇంగ్లీష్ భాషల ని సమన్వయ పరుస్తూ’ తీవెలల్లు కొన్న దీవెభూజమువల్లె రెండుకలసి నడుచు రీతిదగును’ అనడం, వరూధినీ ప్రవరాఖ్య సంవాదములోని లోతులను వివరించడం ఆహుతులని అమితంగా ఆకట్టుకున్నాయి.
వయసులో చిన్నవాడయినా న్యస్తాక్షరిపూరణలో భాగంగా సాధకుడికి కావాల్సిన లక్షణాలని వివరిస్తూ గొప్ప పరిణతిని కనబరిచాడు. అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ చివరగాచి. లలిత్ అన్నిపద్యాలను అవలీలగా ధారణ చేయడంతో అవధానం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉత్తరాధ్యక్షులు శ్రీచినసత్యం వీర్నపు, ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు చి.లలిత్ ఆదిత్య గన్నవరం ను దుశ్శలువాతో సన్మానించి, “అవధాన యువరత్న” బిరుదుతో ఘనంగా సత్కరించారు.
ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి, టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.













