ఘనంగా ముగిసిన టాంటెక్స్ 136వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, నవంబరు 18 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 136 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేసారు.
కార్యక్రమంలో ముందుగా శ్రీమతి మంజుల తెలిదేవర శిష్య బృందం వృంద, సంజన, హమ్సిక, అంటోనియో ప్రార్ధనా గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత సింధూర, సాహితి వేముల అన్నమాచార్య కృతి ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి – మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ పాట పూర్వాపరాలు వివరించారు.అలాగే దానిలో ఉపయోగించిన చరిత్ర, అల్లూరి కి కలిగించిన ప్రేరణ వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు.డా. పుదూర్ జగదీశ్వరన్ గారు ఆముక్తమాల్యద లోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు రాగ యుక్తం గా ఎంకి పాటలు పాడి అలరించారు.
ముఖ్య అతిధి శ్రీ మల్లవరపు అనంత్ గారిని మద్దుకూరి చంద్రహాస్ గారు సభకు పరిచయం చేయగా, టాంటెక్స్ పూర్వాధ్యక్షులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు పుష్పగుచ్చం తో సత్కరించారు. శ్రీ మల్లవరపు అనంత్ గారు మాట్లాడుతూ, శ్రీ శ్రీ ప్రముఖంగా అభ్యుదయ కవి, విప్లవ కవి. అలాంటి శ్రీ శ్రీ రచనలలోనుండి హాస్యం వెతకడం సాహసమే అవుతుంది. శ్రీ శ్రీ వ్రాసిన సిప్రాలి (సిరి సిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమఋక్కులు ) పుస్తకాన్ని కూలంకషంగా పరిశీలించి దానిలోని హాస్యాన్ని సభికులకు పంచి సభలో నవ్వులు పూయించారు ముఖ్య అతిధి మల్లవరపు అనంత్. కేవలం నవ్వు పుట్టించడం కోసమే కాకుండా చైతన్యం, విమర్శ, సామాజిక ప్రయోజనం లక్ష్యంగా శ్రీ శ్రీ రచనలలో హాస్యం తొణికిసలాడింది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు.
శ్రీ అనంత్ మల్లవరపు గారిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శ్రీమతి శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి శ్రీమతి పాలేటి లక్ష్మి పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. శ్రీ అనంత్ మల్లవరపు గారు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి శీలం మాట్లాడుతూ శ్రీ అనంత్ మల్లవరపు గారి సాహిత్య సేవలను ఎంతో కొనియాడారు మరియు తను నిర్వహించిన పూర్వ సాహిత్య సదస్సులను గుర్తు చేసుకున్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన్ ఫన్ ఏసియా, టీవీ9, టివి5 , టి.ఎన్.ఐ, తెలుగు టైమ్సలకు ధన్యవాదాలు తెలియజేశారు.













