తెలుగు టైమ్స్ ప్రచురించిన కోవిడ్ లో తానా సేవలు సావనీర్ ఆవిష్కరణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోవిడ్ సంక్షోభ సమయంలో చేసిన సేవలపై తెలుగు టైమ్స్ ప్రచురించిన కోవిడ్‌లో తానా సేవలు సావనీర్‌ను తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పార్లమెంట్ మాజీ సభ్యుడు, సినీనటుడు మురళీ మోహన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో తెలుగు ప్రజలకు తామేమి చేయాలని ఆలోచించి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందించుకుని తానా టీమ్ సహకారంతో అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇటు అమెరికాలోనూ తెలుగు కమ్యూనిటీకి సేవలందించామని అన్నారు. ఎంతోమంది సభ్యులు, దాతల సహకారంతో తమ తమ ప్రాంతాల్లో అన్నదానం, నిత్యావసర వస్తువుల పంపిణీ, మాస్క్ లను పంపిణీ వంటివి చేశారన్నారు. కరోనా నుంచి రక్షణ కోసం దాదాపు 10 లక్షలమందికి మాస్క్ లను ఇచ్చామని, 4 లక్షల మందికి అన్నదానం చేశామని చెప్పారు. తానా టీమ్‌స్క్వేర్ ద్వారా కూడా వివిధ చోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ పుస్తకంలో అన్నీ సేవలను పొందుపరచకపోయినా సాధ్యమైనవంతవరకు తాము చేసిన సేవలను పుస్తకరూపంలో తీసుకురావడం పట్ల తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుకు ధన్యవాదాలు తెలిపారు.
తానా ఫౌండేషన్ అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ, ఫౌండేషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, ఎక్కడెక్కడ సేవలు అవసరమో గుర్తించి, ఆయా చోట్ల ఉన్న ఎన్జీవోలు, దాతల సహకారంతో కార్యక్రమాలను చేశామని అన్నారు. లక్షలాదిమందికి నిత్యావసర వస్తువులను, 4 లక్షల మందికి అన్నదానం వంటి కార్యక్రమాలను చేశామన్నారు. మా సేవా కార్యక్రమాల్లో ముందుగా కరోనా నుంచి రక్షణకోసం మాస్క్ లను వివిధ చోట్ల పంపిణీ చేశామన్నారు. దాదాపు 10 లక్షల మందికి మాస్క్ లను ఇచ్చామన్నారు. మేము మాస్క్ లు పంపిణీ కార్యక్రమం చేపట్టాక చాలామంది కూడా మాస్క్ లు పంపిణీకి ముందుకు వచ్చారన్నారు. ఈ సావనీర్లో చాలా సేవా కార్యక్రమాలను కవర్ చేశారని ఇక ముందు కూడా తెలుగుటైమ్స్ తో తానా అనుబంధం కొనసాగుతుందని నిరంజన్ శృంగవరపు అన్నారు.
తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలో కూడా వివిధ నగరాల్లో తానా కోవిడ్ సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించామని, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను తెలుగు టైమ్స్ పుస్తకరూపంలో తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, తానాతో తెలుగుటైమ్స్ కు ఎప్పుటినుంచో మంచి అనుబంధం ఉందని, గతంలో కూడా తానాకు సంబంధించి తానా తరంగాలు పేరుతో సావనీర్లను పబ్లిష్ చేయడం జరిగిందని తెలిపారు. కోవిడ్ సమయంలో తానా చేసిన సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సేవలను పుస్తకరూపంలో తీసుకురావాలని అనుకోవడం, దానికి సంబంధించి అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, ఇతర సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు తెలుగు రాష్ట్రాల్లోనూ, అమెరికాలోనూ తానా చేసిన సేవలను ఫేస్బుక్ ద్వారా, ఇ-మెయిల్ ద్వారా ఇతర మార్గాల ద్వారా సేకరించిన సమాచారంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. సాధ్యమైనంతవరకు అన్నీ సేవలను ఇందులో తీసుకువచ్చేందుకు కృషి చేశామన్నారు. ఇందులో ఎవరైనా తాము చేసిన సేవలను పొందుపరచలేదని భావిస్తే, అది సమాచారలోపం వల్లనే జరిగి ఉండవచ్చని, తమకు ఆ సేవల సమాచారం తెలియకపోవడం వల్ల రాలేకపోయి ఉండవచ్చని చెప్పారు. ఈ పుస్తకాన్ని సాధ్యమైనంతవరకు అందరికీ నచ్చేలా తీసుకువచ్చామన్నారు.
ఈ పుస్తకంలో ఉన్న అంశాలను తానా న్యూజెర్సి రీజినల్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి ప్రతి పేజీపరంగా అందరికీ వివరించడం చాలా ఆకట్టుకుంది. ఇలా మంచిగా వివరించి చెప్పినందుకు తెలుగు టైమ్స్ టీమ్ ఆయనకు ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ కార్యక్రమంలో తానా కార్యదర్శి రవి పొట్లూరి, జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి, తానా కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రా, కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మల్లివేమన, ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ లక్ష్మీదేవినేని, న్యూజెర్సి రీజినల్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి, న్యూయార్క్ రీజినల్ కో ఆర్డినేటర్ సుమంత్ రామ్సెట్టి, తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని తదితరులు పాల్గొని మాట్లాడారు.
జూమ్ ద్వారా జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుటైమ్స్ న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్తోపాటు, డిజైనర్ సయ్యద్ జాకీర్ హుస్సేన్, వెబ్ డిజైనర్ సురేష్ బాబు, సైదులు, రాజేష్, మార్కెటింగ్ టీమ్ ముహమ్మద్ ఖాజా, ప్రశాంత్ పాల్గొన్నారు.
ఈ పుస్తకం చూడాలనుకున్నవారు ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Click here view TANA Services book













