TANA: తానా ఆన్‌లైన్ ఏపీ కాలిక్యులస్ సమ్మర్ క్యాంప్ సక్సెస్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) న్యూయార్క్ బృందం ఆధ్వర్యంలో 15 ఏళ్లు, అంతకు పైబడిన హైస్కూల్ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ ఏపీ కాలిక్యులస్ సమ్మర్ క్యాంప్ అద్భుతంగా నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా హైస్కూల్ విద్యార్థులకు ఈ కార్యక్రమంలో విలువైన శిక్షణ లభించింది. విద్యార్థులలో ప్రాబ్లం సాల్వింగ్, అనలిటికల్ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా (TANA) న్యూయార్క్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని సహాయ సహకారాలతో ఈ కోర్సును రూపొందించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్రంగా నేర్చుకునే తత్వాన్ని పెంపొందించేలా ఈ కోర్సును తీర్చిదిద్దారు.
ఆగస్టు 5, 6, 12, 13, 19, మరియు 20 తేదీలలో ప్రతి మంగళ, బుధవారాల్లో సాయంత్రం 6:00 నుండి 7:30 EST (యూరోపియన్ స్టాండర్డ్ టైం) వరకు ఆరు సెషన్లలో, విద్యార్థులకు తొమ్మిది నుండి పది గంటలపాటు క్లాసులు జరిగాయి. ఈ తరగతుల్లో ప్రీ-కాలిక్యులస్, కాలిక్యులస్, లిమిట్స్, డెరివేటివ్స్, డెరివేటివ్స్ యొక్క అనువర్తనాలు, ఇంటిగ్రల్స్, వాటి అనువర్తనాలతో సహా అనేక అంశాలను శ్రీ మహాన్ మాలెపాటి బోధించారు. భవిష్యత్ అవసరాల కోసం అన్ని సెషన్లను రికార్డ్ చేసి విద్యార్థులకు తానా (TANA) అందించింది.
విద్యార్థులపై ఈ కార్యక్రమం చూపిన సానుకూల ప్రభావం చూస్తే చాలా సంతోషంగా ఉందని తానా (TANA) న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు అన్నారు. “ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు దిలీప్ ముసునూరి, శ్రీనివాస్ నాదెళ్ల, ప్రసాద్ కోయికి, అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన కమ్యూనిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం విద్య పట్ల మన సమాజం చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు.