తెలంగాణ పోలీసులకు ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను పంపిణీ చేసిన తానా, హైదరాబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్ ప్రతినిధులు

తానా… తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. భారీ సంఖ్యలో సభ్యులను కలిగి ఉన్న సంస్థ. గత 40 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులున్న వారికి సహాయ సహకారాలను అందిస్తోంది. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. తాజాగా… కరోనా నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యల్లో పాల్గొంది. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా వివిధ ఆస్పత్రులకు 600 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను పంపిణీ చేసింది. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్, తానా కలిసి ఈ సహాయక చర్యల్లో పాల్గొంటోంది. జూన్ 9 న తానా, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సంస్థలు కలిసి 6 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను తెలంగాణ పోలీసులకు బహుమతిగా ఇచ్చాయి. కరోనా కాలంలో పోలీసు విభాగం వారు చేస్తున్న సేవలకు బహుమతిగా ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమానికి సైబరాబాద్ సీపీ సజ్జన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ కరోనా కాలంలో పోలీసులు అందిస్తోన్న సేవలకు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో జరిగిన ‘వ్యాక్సినేషన్ మహా డ్రైవ్’ లో భాగమైనందుకు పోలీసులను అభినందించారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని, అందుకు ప్రజలకు ధన్యవాదాలు ప్రకటించారు. అతి త్వరలోనే సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వస్తుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీ తానా ప్రతినిధులకు, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలోనూ ఇదే రకమైన సేవా భావంతో ఈ సంస్థలు పనిచేయాలని సీపీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్‌కు సంబంధించిన తానా ట్రస్టీ శ్రీనాథ్ కుర్రా ఈ సందర్భంగా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారిలోనూ పోలీసులు చాలా సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారని, కరోనా కట్టడిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ కాన్సట్రేషన్లను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన తానా సభ్యులకు, యూఎస్ దాతలకు శ్రీనాథ్ కుర్రా ధన్యవాదాలు తెలిపారు.
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ అధ్యక్షుడు వై.వీ. గిరి మాట్లాడుతూ… భారత్‌లో పోలియో నిర్మూలనకు తాము చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించిందని, ఈ నేపథ్యంలోనే దేశంలో వ్యాక్సినేషన్ అమలు చేయడంలోనూ తమ మద్దతు కోరిందని పేర్కొన్నారు. కరోనా కాలంలో పోలీసులు చాలా సేవ చేస్తున్నారని, 24 గంటలూ ప్రజల కోసం పనిచేస్తున్నారని వై.వీ. గిరి ప్రశంసించారు.
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్‌కు 5 ఆక్సిజన్ కాన్సట్రేటర్లను ఇవ్వడానికి ముందుకు వచ్చిన తానా నాయకత్వానికి తానా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సీవీ సుబ్బారావు కృతజ్ఞతలు ప్రకటించారు. అంతేకాకుండా మరో ఆక్సిజన్ కాన్సట్రేటర్‌ను యూఎస్‌లో ఉన్న తన స్నేహితుడి ద్వారా ఇప్పించడానికి ముందుకు వచ్చిన పంకజ్ దివాన్‌కు కూడా ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సీవీ సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.