TAMA: అట్టహాసంగా తామా సంక్రాంతి సంబరాలు
మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (TAMA) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను చిన్నారులకు భోగిపళ్లు, అక్షింతలతో, పెద్దల ఆశీర్వాదాలతో అట్లాంటా(Atlanta) లోని దేశాన మధ్యపాఠశాలలో జనవరి 18 న ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తామా వారు ఏర్పాటు చేసిన వేదిక అలంకరణ తెలుగు వారి గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా సర్వాంగ సుందరంగా ఉందని అందరూ మెచ్చుకొన్నారు. వెయ్యిమందికి పైగా ప్రవాస తెలుగు వారు హాజరైన ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఎన్నికైన తామా అధ్యక్షులు రూపేంద్ర వేములపల్లి మరియు వారి కార్యవర్గ సభ్యులతో నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ మొత్తం వేడుకకు లావణ్య వాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ సంక్రాంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జార్జియా సెనెటర్ షాన్ స్టిల్, జార్జియా స్టేట్ రెప్రెసెంటేటివ్స్ టాడ్ జోన్స్ కార్టర్ బర్రెట్ లు హాజరైనారు. సెనెటర్ షాన్ స్టిల్ మాట్లాడుతూ మధ్య మరియు ఉన్నత తరగతి పిల్లలకు ‘సెనెటర్ పేజీ’ ఉందని, దానిలో నమోదు చేసుకొంటే, జార్జియా స్టేట్ రాజకీయాల గురించి, కాపిటల్ హిల్ లో జరిగే విషయాల గురించి తెలుస్తుందని చెప్పారు. దీనికి హాజరయ్యే పిల్లలకు బడిలో అనుమతితో కూడిన సెలవు కూడా మంజూరు చేస్తారని చెప్పారు. కార్టర్ బర్రెట్ కార్యక్రమానికి వచ్చిన వారిని తెలుగు లో ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అని పలుకరించారు. ఈ తెలుగు పదాన్ని 75 సార్లు ఉచ్చరించానని చమత్కారంగా అన్నారు. టాడ్ జోన్స్ మాట్లాడుతూ తామా సంస్థతో, తెలుగు వారితో అనుబంధం ఉందని, ఈ పండుగ ద్వారా శాంతి, సౌభాగ్యం వెల్లివిరుస్తుందని ఆకాంక్షించారు. వచ్చిన అతిధులకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చక్కని జ్ఞాపికలతో పాటు శాలువాను, పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా సత్కరించారు.
హేమ తిరు ఆధ్వర్యాన పిల్లలకు చిత్ర కళల పోటీలు పెట్టగా దాదాపు 60 కి పైగా పిల్లలు, అలాగే ముగ్గుల పోటీలలో 30 కి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. పంచుకోవడంతోనే సంతోషం పెంచుకోవాలనే ఈ పండుగ పరమార్థం. ఈ ఉద్దేశ్యంతో ఈ సారి మొట్టమొదటిసారిగా లైఫ్ సౌత్ కమ్యూనిటీ వారితో కలిసి తామా వారు రక్త దాన శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి 30 మంది రక్తదానం చేస్తారని ఆశించగా మొత్తం 50 మందికి పైగా స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేశారు. సంక్రాంతి పండుగకు భారతీయ సంస్కృతి లో ఉన్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, అన్ని తరాల వారికి ప్రత్యేకంగా ఆకట్టుకునే కార్యక్రమాలు ఈ వేడుకలో భాగంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలలో ప్రాంతీయ నాట్య పాఠశాలల ద్వారా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించారు. పిల్లలు పండుగకు సంబంధించిన పాటలు, శ్లోకాలు , మరియు నృత్యాలను ఆడి, పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీటిలో శిరీష రూపొందించిన బాగుందని మెచ్చుకొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు ఆరు గంటల పాటు నిర్విరామంగా కొనసాగాయి.
గాయకులు హారిక నారాయణన్, ప్రసాద్ సింహాద్రి సంయుక్తంగా శ్రోతలకింపైన పాటలు పాడి పిల్లలను, పెద్దలను సంగీత విభావరి లో ఓలలాడిరచారు. పాటలకు చిన్నారులు, మహిళలు, పురుషులతో పాటు తామా బోర్డు సభ్యులు కూడా నృత్యాలు చేశారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామా రావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన నటించిన చిత్రాలలోని కొన్ని పాటలు పాడి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తామా సంస్థ వారు పిల్లలకు అందరికీ గాలి పటాలు పంపిణీ చేశారు. వచ్చిన వారికి తెలుగు సంప్రదాయ భోజనం కూడా వడ్డించడం జరిగింది. వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన వంటివి విశేషంగా ఆకట్టుకొన్నాయి.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా శేఖర్స్ రియాల్టీ, రియల్ టాక్స్ యాలీ, డబ్బావాలా, కాకతీయ ఇండియన్ కిచెన్ వ్యవహరించారు. స్పాన్సర్స్ అందరినీ సభాముఖంగా సన్మానించడం కూడా జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు రూపేంద్ర వేములపల్లి, చలమయ్య బచ్చు, సుధా ప్రియాంక సుందర, రాఘవ తడవర్తి, శేఖర్ కొల్లు, రవి కల్లి, ప్రియాంక బలుసు, తిరుమలరావు చిల్లపల్లి, సునీత పొట్నూరు, శ్రీనివాసరావు రామనాధం, యశ్వంత్ జొన్నలగడ్డ, కృష్ణ ఇనపకుతిక, సురేష్ యాదగిరి, నగేష్ దొడ్డాక, సాయిరాం కారుమంచి, శ్రీనివాసులు రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, పాల్గొన్నారు. చివరగా సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసిన తామా బృందం, స్పాన్సర్స్, అతిధులు, వాలంటీర్లు, ముఖ్య అతిధులు, పాఠశాల యాజమాన్యానికి, ఫుడ్ టీం, డెకరేషన్ టీం, డీజే టీం, ప్రేక్షకులందరికీ తామా అధ్యక్షుడు రూపేంద్ర వేములపల్లి ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.







